priyanka gandhi: దయచేసి నన్ను ఆమెతో పోల్చకండి: ప్రియాంకాగాంధీ

  • ఇందిరాగాంధీ అంతటి గొప్ప వ్యక్తిని కాను
  • సేవ చేయాలనే ఆమె స్వభావం నాలో, రాహుల్ లో ఉన్నాయి
  • బీజేపీ స్వప్రయోజనాల కోసమే పని చేస్తుంది

తన నానమ్మ ఇందిరాగాంధీ అంతటి గొప్ప వ్యక్తిని తాను కాదని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ అన్నారు. ఆమె ముందు తాను ఓ నీటి బిందువులాంటిదాన్నని చెప్పారు. ఇందిరతో తనను పోల్చవద్దని కోరారు. అయితే సమాజం కోసం సేవ చేయాలనే ఆమెలోని అకుంఠిత స్వభావం తనలో, తన సోదరుడు రాహుల్ గాంధీలో ఉన్నాయని అన్నారు. ఈ స్వభావాన్ని తమ నుంచి ఎవరూ తీసివేయలేరని చెప్పారు. మీరు మాకు మద్దతు పలికినా, పలకకపోయినా మేము మీ సేవలోనే ఉంటామని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో బీజేపీపై ప్రియాంక మండిపడ్డారు. దేశం కోసం కాకుండా, సొంత ప్రయోజనాల కోసం ఆ పార్టీ పని చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వాలు రెండు రకాలుగా ఉంటాయని... ఒక రకం ప్రజల కోసం పని చేస్తుందని, మరో రకం స్వలాభం కోసం పని చేస్తుందని చెప్పారు. బీజేపీది అంతా పబ్లిసిటీ మాత్రమేనని ఎద్దేవా చేశారు. కాన్పూర్ ను స్మార్ట్ సిటీ చేస్తామని బీజేపీ చెప్పిందని... కానీ, ఆ దిశగా ఇంతవరకు ఏమీ జరగలేదని అన్నారు. బీజేపీ పాలనలో నిరుద్యోగం పెరిగిపోయిందని... అప్పులపాలై రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు ఏడాదికి రూ. 72వేల ఆర్థిక సాయాన్ని చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని... కానీ, అంత డబ్బు ఎక్కడుందని బీజేపీ ప్రశ్నిస్తోందని ఎద్దేవా  చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చుతామని అన్నారు. 

More Telugu News