kuldeep yadav: తన ఓవర్‌లో 27 పరుగులు పిండుకున్న మొయీన్ అలీ.. మైదానంలోనే ఏడ్చేసిన కుల్దీప్

  • ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న స్పిన్నర్‌గా కుల్దీప్ చెత్త రికార్డు
  • ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడిన మొయీన్ అలీ
  • నిశ్చేష్టుడై ఏడ్చేసిన చైనామన్ బౌలర్

ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఏడ్చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ మొయీన్ అలీలు చెలరేగిపోయారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. బంతిపై బ్యాట్‌తో విచక్షణ రహితంగా దాడి చేశారు. వీరిద్దరి దెబ్బకు బెంగళూరు స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో కోల్‌కతా చతికిలపడడంతో బెంగళూరు రెండో విజయాన్ని నమోదు చేసింది.

చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ వేసిన 16వ ఓవర్‌లో మొయీన్ అలీ శివాలెత్తిపోయాడు. గతంలో ఎన్నడూ ఆడని ఆటతీరుతో చెలరేగిపోయాడు. తొలి బంతిని ఫోర్ కొట్టిన అలీ రెండో బంతిని సిక్సర్‌గా మలిచాడు. మూడు, నాలుగు బంతులను ఫోర్, సిక్సర్ కొట్టాడు. ఐదో బంతి వైడ్ కాగా, ఆ తర్వాతి బంతికి మరో సిక్సర్ బాదాడు. దీంతో ఐదు బంతుల్లోనే 27 పరుగులు లభించాయి. అయితే, చివరి బంతిని కూడా స్టాండ్స్‌లోకి తరలించే క్రమంలో ప్రసీద్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

తన బౌలింగ్‌ను ఉతికి ఆరేసిన అలీని చూసి కుల్దీప్ నిశ్చేష్టుడయ్యాడు. చివరి బంతికి అలీ అవుటయ్యాక కుల్దీప్ కోపంతో తన క్యాప్‌ను విసిరికొట్టాడు. ఆ తర్వాత ఉద్వేగాన్ని ఆపుకోలేక ఏడ్చేశాడు. కాగా, 24 ఏళ్ల కుల్దీప్ తన చెత్తబౌలింగ్‌తో ఐపీఎల్‌తో ఓ చెత్త రికార్డును తన పేరున రాసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 4 ఓవర్లు వేసిన కుల్దీప్ 59 పరుగులిచ్చి ఓ వికెట్ నేలకూల్చాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న స్పిన్నర్‌గా కుల్దీప్ పేరు రికార్డులకెక్కింది.

More Telugu News