rajaneekanth: రజనీకాంత్‌కు వేసిన సిరా చుక్క చెయ్యి మారింది...దుమారం రేగింది!

  • ఎడమ చేతికి బదులు కుడిచేతికి ఇంకు చుక్క పెట్టిన సిబ్బంది
  • విమర్శలు రావడంతో వివరణ కోరిన ఎన్నికల సంఘం
  • చెన్నైలోని స్టెల్లా మేరీ కళాశాలలో ఓటేసిన కబాలి

చిన్న సిరా చుక్క ఓ ఉద్యోగి జీవితాన్నే మార్చేసేలా ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం చెన్నైలో ఓటు వేసిన ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌కు వేసిన సిరా చుక్క చెయ్యి మారడంపై దుమారం రేగింది. దీంతో నిర్లక్ష్యం వహించిన పోలింగ్‌ సిబ్బందిపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎడమ చెయ్యి చూపుడు వేలుకు బదులు కుడి చేతి చూపుడు వేలుకు ఇంకు రాయడంపై వివరణ కోరింది.

సాధారణంగా ఏ ఎన్నికల్లోనైనా సిరా చుక్కను ఎడమ చెయ్యి చూపుడు వేలుకు పెడతారు. ప్రత్యేక కారణాల వల్ల మార్చాల్సి వస్తే ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తుంది. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో తొలివిడత పోలింగ్‌కు ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎడమ చెయ్యి మధ్య వేలుకు సిరా చుక్క వేయాలని ఎన్నికల సంఘం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల నిబంధనల అమల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా ఏళ్ల తర్వాత  కూడా అది మెడకు చుట్టుకుంటుంది. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది.

చెన్నైలోని స్టెల్లా మేరీ కళాశాల ప్రాంగణంలో ఓటు హక్కు వినియోగించుకున్న రజనీకాంత్‌ కుడిచేతి వెలికి అక్కడి సిబ్బంది సిరా గుర్తు వేశారు. ఓటు వేశాక బయటకు వచ్చిన రజనీకాంత్‌ కుడిచేతి చూపుడు వేలును మీడియాకు చూపించారు. మార్పును గుర్తించిన పలువురు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం ఆరాతీసింది.

జిల్లా ఎన్నికల అధికారి సత్యప్రసాద్‌ సాహును వివరణ కోరింది. ఈ సందర్భంగా సాహు మాట్లాడుతూ జరిగింది పొరపాటేనని అంగీకరించారు. దీనిపై నివేదిక కోరినట్లు తెలిపారు. 

More Telugu News