KCR: కేసీఆర్ మరో వ్యూహం... జడ్పీ చైర్మన్ల పేర్లు ముందుగానే ఫైనల్!

  • నేడు వెలువడనున్న నోటిఫికేషన్
  • ఇప్పటికే పలు జిల్లాలకు చైర్మన్ల పేర్లు ఖరారు
  • నేడో, రేపో మిగిలిన పేర్లకూ ఓకే చెప్పనున్న సీఎం

నేడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుండగా, పూర్తి ఆధిపత్యమే లక్ష్యంగా పావులు కదుపుతున్న గులాబీ బాస్ కేసీఆర్, జెడ్పీ చైర్‌ పర్సన్‌ అభ్యర్థులుగా ఎవరు ఉంటారన్న విషయమై ముందే స్పష్టత ఇచ్చేశారు. పలు కారణాలతో గత ఎన్నికల్లో సీట్లు ఇవ్వలేకపోయిన వారికి, పోటీ చేసి ఓడిన వారిలో కొందరికి జిల్లా పరిషత్‌ చైర్మన్లుగా అవకాశం ఇస్తానని ముందే చెప్పిన కేసీఆర్, పలు జిల్లాలకు అభ్యర్థులను ప్రకటించారు. జిల్లాల వారీగా రిజర్వేషన్లు, ఆశావహుల వివరాలను పరిశీలించిన కేసీఆర్, మంత్రులు, ముఖ్య నేతలతో కలిసి జాబితాను వడపోసి ఒక్కొక్కరి పేరును ఖరారు చేశారు.

ఆసిఫాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గా మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవికి పోటీ అధికంగా ఉంది. ఇల్లెందు మాజీ ఎమ్మెలే కోరం కనకయ్య, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, పినపాక మాజీ ఎమ్మెల్యే పీ వెంకటేశ్వర్లులలో ఒకరికి ఈ పదవి దక్కనున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా చైర్‌ పర్సన్‌ తుల ఉమకు ఈ దఫా జగిత్యాల జడ్పీ నుంచి అవకాశం లభించవచ్చని తెలుస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్‌కు రెండోసారి చైర్‌ పర్సన్‌ గా వ్యవహరిస్తున్న పట్నం సునీతా మహేందర్‌ రెడ్డికి వికారాబాద్ జిల్లా పదవి ఖాయమైంది.  

రంగారెడ్డి జెడ్పీ పదవి జనరల్‌ మహిళకు రిజర్వ్ కావడంతో షాద్‌ నగర్‌ మాజీ ఎమ్మెల్యే సీహెచ్ ప్రతాప్‌రెడ్డి కుటుంబ సభ్యులు, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు అనిత పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ఇక నల్లగొండ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గా బండ నరేందర్‌ రెడ్డి పేరును ఖాయం చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. సత్తుపల్లి అసెంబ్లీ స్థానానికి టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి భంగపడి అలకబూనిన మట్టా దయానంద్‌ కు కూడా జడ్పీ పదవి ఖరారైంది. మిగతా జిల్లాల కసరత్తునూ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్న నిశ్చయంతో కేసీఆర్ ఉన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

More Telugu News