Russia: చనిపోయిందని పూడ్చిపెడితే.. సమాధిని తవ్వుకుని బయటికి వచ్చిన శునకం!

  • రష్యాలో జరిగిన ఘటన
  • కదలక లేకపోవడంతో చనిపోయిందనుకున్న యజమాని
  • ఆశ్చర్యానికి గురిచేస్తూ తిరిగిరాక

మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా మరణం అనేది అత్యంత బాధాకరమైన విషయం! అంతకంటే విషాదం మరొకటి ఉండదు. కానీ, రష్యాలో జరిగిన ఘటనలో ఓ కుటుంబం మొదట తీవ్ర విషాదానికి గురైంది, ఆపై సంతోషంలో ఓలలాడింది.

అసలు విషయం ఏంటంటే... రష్యాలోని నోవోనికోల్సోక్ అనే గ్రామంలో నివసించే ఓ కుటుంబం వద్ద డిక్ అనే కుక్క ఉంది. దాని వయసు 15 ఏళ్ల పైనే ఉంటుంది. అయితే, ఒకరోజు ఎంత లేపినా లేవకపోవడంతో యజమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. శ్వాస కూడా తీసుకోకపోవడంతో చనిపోయిందని నిర్ధారించుకున్నారు.

దశాబ్దానికి పైగా తమతో ఎంతో అనుబంధం పెంచుకున్న ఆ శునకం మరణించడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా రోదించింది. దాంతో డిక్ ను తమకు చెందిన స్థలంలోనే పూడ్చిపెట్టారు. తమ కుటుంబ సభ్యుడిగానే భావించి అంత్యక్రియలు నిర్వహించారు.

అయితే, అందరినీ షాక్ కు గురిచేస్తూ డిక్ తన సమాధిపై పరిచిన మట్టిని తొలుచుకుని బయటికి వచ్చింది. ఒంటికి మట్టి అంటుకుని ఉన్న స్థితిలో రోడ్డుపైకి రావడంతో పెట్ యానిమల్ షెల్టర్ సిబ్బంది దాన్ని పట్టుకుని తీసుకెళ్లారు. దాని ఫొటోను సోషల్ మీడియాలో పెట్టడంతో డిక్ యజమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

డిక్ యజమానులే కాదు, ఇరుగుపొరుగు వారు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. నేరుగా షెల్టర్ హోమ్ వద్దకు వెళ్లి తమ ప్రియనేస్తాన్ని వెంట తెచ్చుకున్నారు. అంతేకాదు, డిక్ ను అక్కునచేర్చుకున్న షెల్టర్ సిబ్బందికి తమ సంతోషం కొద్దీ రూ.5 వేలు చేతిలో పెట్టారు.

More Telugu News