Telugudesam: పోలింగ్ పూర్తవకముందే ఈసీ బాగా పనిచేస్తోందని జగన్ చెప్పడం వెనుక అర్థమేంటి?: నక్కా ఆనందబాబు

  • జగన్ పగటి కలలు కంటున్నారు
  • ఈసీ తీరుపైనా టీడీపీ నేత మండిపాటు
  • ప్రజాసమస్యలపై సమీక్షలను అడ్డుకుంటోంది

ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ, గత ఎన్నికల కంటే ఈసారి టీడీపీకి మరిన్ని సీట్లు ఎక్కువ వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తాను అధికారంలోకి వస్తానంటూ జగన్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు కూడా అదే తీరులో ఉన్నారని విమర్శించారు. ఇక, పోలింగ్ రోజున ఓటింగ్ పూర్తికాక ముందే ఈసీ పనితీరు భేష్ అంటూ జగన్ ఎలా ప్రకటన చేశారో చెప్పాలని నక్కా నిలదీశారు. పనిలో పనిగా రాష్ట్ర ఎన్నికల సంఘం పనితీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం ప్రజాసమస్యలపై సమీక్షలు నిర్వహిస్తుంటే ఈసీ అడ్డుకుంటోందని, తద్వారా ప్రజలను కూడా ఇబ్బందుల పాల్జేస్తోందని ఆరోపించారు. పోలింగ్ పూర్తయి రోజులు గడుస్తున్నా ఇంకా ఎన్నికల నిబంధనల పేరిట ఈసీ అభ్యంతరాలు పెడుతోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణలో చేతులెత్తేసిన ఈసీ ఇప్పుడు ప్రజాసమస్యలపై సమీక్షలను కూడా అడ్డుకోవడం దారుణమని అన్నారు. వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకున్న ఈసీ, ఓట్ల గల్లంతు విషయంలో టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుపై ఏమాత్రం స్పందించలేదని నక్కా ఆరోపించారు.

More Telugu News