TTD: పట్టుబడిన 1,381 కిలోల బంగారం మీదేనా? టీటీడీకి తమిళనాడు ఐటీ అధికారుల నోటీసులు!

  • ఎన్నికల వేళ అధికారుల తనిఖీలు
  • పట్టుబడిన టన్నుకు పైగా బంగారం
  • స్పందించాలంటూ టీటీడీని కోరిన ఐటీ

తమిళనాడు ఎన్నికల సందర్భంగా తనిఖీలు జరుపుతున్న వేళ ఏకంగా 1,381 కిలోల బంగారం పట్టుబడటం తీవ్ర కలకలం రేపగా, అది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినదని బంగారాన్ని తరలిస్తున్న వారు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, ఏ విధమైన పత్రాలు లేకుండా బంగారాన్ని తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, బంగారాన్ని ఐటీ శాఖకు అప్పగించారు.

ఇది దేవదేవుడి బంగారమేనని భావిస్తున్న ఐటీ శాఖ, దీనిపై స్పందించాలని టీటీడీకి గురువారం నాడు నోటీసులు పంపింది. బంగారం టీటీడీదేనైతే, ఇలా ఎందుకు తరలించారో తెలిపి తీసుకెళ్లవచ్చని పేర్కొంది. కాగా, గతంలో తమిళనాడులోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఈ బంగారాన్ని టీటీడీ డిపాజిట్ చేయగా, గడువు తీరిందని చెబుతూ, టీటీడీ అధికారులకు చెప్పకుండానే బ్యాంకు అధికారులు బంగారాన్ని అప్పగించేందుకు తెస్తూ పట్టుబడినట్టు తెలుస్తోంది.

కాగా, ఈ విషయమై టీటీడీ అధికారికంగా ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం ఆలయ యంత్రాంగమంతా స్వామివారి వసంతోత్సవాల నిర్వహణలో బిజీగా ఉన్నందన, ఇవి ముగిసిన తరువాతనే స్పందిస్తారని సమాచారం.

More Telugu News