Ramcharan: కులం వల్లే రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి అయ్యారు: అశోక్ గెహ్లాట్

  • గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని మోదీ భయపడ్డారు
  • కుల సమీకరణ కోసం కోవింద్ ను రాష్ట్రపతి చేశారు
  • అద్వానీ రాష్ట్రపతి అవుతారని అందరూ భావించారు

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కుల సమీకరణలను బ్యాలెన్స్ చేసేందుకే కోవింద్ ను రాష్ట్రపతిని చేశారంటూ వ్యాఖ్యానించారు. ఇదే భావనలో దేశ ప్రజలు కూడా ఉన్నారని చెప్పారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలవదనే భయంలో మోదీ ఉన్నట్టు తాను ఒక ఆర్టికల్ లో చదివానని తెలిపారు. ఈ నేపథ్యంలో, కోవింద్ ను రాష్ట్రపతి చేద్దామనే సలహాను మోదీకి అమిత్ షా ఇచ్చారని చెప్పారు. జైపూర్ లో మీడియాతో మాట్లాడుతూ, గెహ్లాట్ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రపతికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నప్పటికీ బీజేపీ అగ్రనేత అద్వానీని ఆ పార్టీ పక్కన పెట్టేసిందని గెహ్లాట్ విమర్శించారు. అద్వానీని రాష్ట్రపతి పదవితో గౌరవిస్తారని అందరూ భావించారని చెప్పారు. ఇది బీజేపీ అంతర్గత విషయమైనప్పటికీ... తాను ఓ ఆర్టికల్ లో చదివినందున దీనిపై మాట్లాడుతున్నానని తెలిపారు.

కాగా, 2017 జూలైలో రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి అయ్యారు. అదే ఏడాది డిసెంబర్ లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి.

More Telugu News