Tamilnadu: రాజకీయాల్లో నన్ను హీరోను చేయవద్దు.. తమిళ నేతకు నటుడు లారెన్స్ హెచ్చరిక!

  • నామ్‌ తమిళర్‌ కట్చి పార్టీ చీఫ్‌ కన్వీనర్‌ సీమాన్‌ నోటిదురుసు
  • రాఘవ లారెన్స్ సేవా కార్యక్రమాలపై విమర్శలు
  • ఘాటుగా స్పందించిన దర్శకుడు

నామ్‌ తమిళర్‌ కట్చి పార్టీ చీఫ్‌ కన్వీనర్‌ సీమాన్‌పై ప్రముఖ నటుడు-దర్శకుడు-కొరియోగ్రఫర్ రాఘవ లారెన్స్ తీవ్రంగా మండిపడ్డారు. సీమాన్ తనను, తన సేవా కార్యక్రమాలను లక్ష్యంగా చేసుకుని విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఫేస్ బుక్ లో ఘాటుగా పోస్టింగ్ పెట్టారు. ఇటీవల జరిగిన పలు పార్టీ కార్యక్రమాల్లో సీమాన్ తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడాన్ని లారెన్స్ తప్పుపట్టారు.

ఫేస్ బుక్ లో లారెన్స్ స్పందిస్తూ.. ‘మీ పార్టీ కార్యకర్తలు సోషల్‌మీడియాలో అనవసరంగా నా దాతృత్వ కార్యకలాపాలపై చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారు. చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. దీని వల్ల నేను మానసికంగా చాలా బాధపడ్డాను. నేను ఓ పబ్లిక్‌ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అక్కడికి మీ పార్టీకి చెందిన వారు వచ్చి బూతులు మాట్లాడి వెళ్లారు. నువ్వు నా గురించి చెడ్డగా ఓ కార్యక్రమంలో చెప్పిన తర్వాత ఇలాంటివి మొదలయ్యాయి. కానీ నేను సంరక్షిస్తున్న దివ్యాంగుల్ని మీ కార్యకర్తలు వేధిస్తున్నారు. వారు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లి సూటిపోటి మాటలు అంటున్నారు’.

నాపై చేసిన విమర్శలకు దీటుగా సమాధానం ఇవ్వగలను. కానీ నా పిల్లలు, నాకు రాజకీయాల గురించి ఏమీ తెలియదు. అందులో నేను జీరోని. గతంలో డ్యాన్స్ విషయంలోనూ నేను జీరోనే.. కానీ ఆ కళను నేర్చుకున్నా. దర్శకత్వంలో నేను జీరో.. తర్వాత దాన్నీ నేర్చుకున్నా. చిత్ర నిర్మాణంలో కూడా నేను జీరోనే.. ఆ రంగంలోనూ రాణించా.

కాబట్టి నేను రాజకీయాలు నేర్చుకునేలా నువ్వు చేయొద్దు. నేనూ దాన్ని నేర్చుకోగలను అందులో హీరో కాగలను’ అని హెచ్చరించారు. ఏదైనా సమస్య ఉంటే కూర్చుని మాట్లాడి పరిష్కరించుకుందామని లారెన్స్ పిలుపునిచ్చారు. ప్రచారం కోసమే లారెన్స్ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటారని సీమాన్ ఇటీవల విమర్శించారు. దీంతో ఈ వివాదం రాజుకుంది.

More Telugu News