Telangana: యాక్టింగ్ స్కూలు ముసుగులో అమ్మాయిలకు వేధింపులు!

  • నగరంలోని హిమయత్ నగర్ లో ఘటన
  • ‘సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్’లో దారుణం
  • యువతిని 8 గంటలు స్టేషన్ లో కూర్చోబెట్టిన పోలీసులు

మీడియా, బాలీవుడ్ సహా వేర్వేరు రంగాల్లో లైంగిక వేధింపులపై ఇటీవల మీటూ ఉద్యమం వచ్చిన సంగతి తెలిసిందే. పలువురు మహిళలు తమను వేధించిన కీచకుల వివరాలను మీటూలో భాగంగా బయటపెట్టారు. తాజాగా అలాంటి ఉదంతమే తెలంగాణలోని హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చింది. నటన నేర్పాలంటే ఒంటిపై బట్టలన్నీ విప్పాలని యాక్టింగ్ స్కూల్ డైరెక్టర్ యువతులను ఆదేశించాడు. దీంతో ఓ అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు ఫిర్యాదు స్వీకరించేందుకు ఆమెను 7 గంటల పాటు స్టేషన్ లో కూర్చోబెట్టి నరకం చూపించారు. ఈ ఘటన హైదరాబాద్ లోని హిమయత్ నగర్ లో చోటుచేసుకుంది.

హిమయత్ నగర్ లోని ‘సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్’కు వినయ్ వర్మ అనే వ్యక్తి డైరెక్టర్‌గా ఉన్నాడు. ఇటీవల ఈ సంస్థలో 8 మంది విద్యార్థులు చేరారు. ఇక్కడ ఉదయం 6.30 గంటల నుంచి 9.30 గంటల వరకూ తరగతులు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఈ నెల 16న క్లాసుకు వచ్చిన డైరెక్టర్ వినయ్..  తలుపులు, కిటికీలు అన్నీ మూయమని చెప్పాడు. అనంతరం ఒక్కొక్కరిని బట్టలు విప్పాల్సిందిగా ఆదేశించాడు. ఇందుకు అచింత కౌర్ చద్దా  అనే విద్యార్థిని నిరాకరించారు. దీంతో క్లాస్ నుంచి బయటకు వెళ్లిపోవాలని వినయ్ ఆమెపై గద్దించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

ఈ విషయమై యువతి మీడియాతో మాట్లాడుతూ..‘క్లాస్ లో బట్టలు విప్పాలని మా అందరినీ వినయ్ సార్ ఆదేశించారు. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నేను బట్టలు తీయనని మా సార్‌కు చెప్పాను. ఆయన నన్ను తిట్టి బయటికి వెళ్లిపొమ్మని చెప్పారు. కానీ ఒక యువతి ఆయన చెప్పినట్టుగానే బట్టలు విప్పింది. మిగతా యువకులు కూడా అలాగే చేశారు’ అని వాపోయింది.

తాను షీ టీమ్స్ కు ఫిర్యాదు చేయగా ఏసీపీ నర్మద, రామ్ లాల్  వెంటనే స్పందించి నారాయణ గూడ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారని పేర్కొన్నారు. అయితే అక్కడి పోలీసులు తాను మధ్యాహ్నం ఒంటి గంటకు వెళితే రాత్రి 8 గంటల వరకూ తనను నిరీక్షణలో పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. వినయ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 

More Telugu News