Crime News: ఇంజనీర్‌ అయినా డాక్టర్‌గా వేషం...అమ్మాయిలకు వల వేసి మోసం!

  • డేటింగ్‌ యాప్‌లో యువతులతో చాటింగ్‌
  • ఫొటోలు సేకరించి బ్లాక్‌మెయిల్‌తో డబ్బు డిమాండ్‌
  • విషయం వెల్లడి కావడంతో కటకటాల వెనక్కి

డేటింగ్‌ యాప్‌ ద్వారా యువతులతో పరిచయం పెంచుకుని డబ్బుకోసం వారినే బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న ఓ యువ ఇంజనీర్‌ని పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కిపంపారు. కొన్నాళ్లుగా ఇతని బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌ను భరించిన ఓ యువతి చివరికి విసిగిపోయి ధైర్యంగా పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడి పాపం పండింది.

సైబరాబాద్‌ క్రైం పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే...కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్‌కు చెందిన గొల్లాదొడ్డి అబ్దుల్లా (35) వృత్తిరీత్యా ఇంజనీర్‌. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఓ డేటింగ్‌ యాప్‌లో డాక్టర్‌ కార్తీక్‌రెడ్డిగా తన పేరును నమోదు చేసుకున్నాడు. నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో‌ అనెస్థటిస్ట్ (మత్తు ఇచ్చే డాక్టర్)గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నాడు.

నాలుగేళ్ల క్రితం ఓ యువతితో యాప్‌లో ఇతనికి పరిచయం అయింది. అప్పటికి వైద్య విద్య అభ్యసిస్తున్న ఆమెతో అబ్దుల్లా తరచూ చాటింగ్‌ చేసేవాడు. కొన్నాళ్ల తరువాత ఇద్దరూ బయట కలుసుకునే వారు. ఆ సందర్భంలో తీసిన ఫొటోలు, వీడియోలు అబ్దుల్లా భద్రపరిచాడు.

కొన్నాళ్ల తర్వాత ఆ యువతికి పెళ్లయి పోవడంతో తనతో చాటింగ్‌ చేయడం మానేయాలని కోరింది. ఇదే అవకాశంగా తీసుకున్న అబ్దుల్లా ఆ ఫొటోలు, వీడియోలు చూపి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. తాను అడిగినంత మొత్తం ఇవ్వకుంటే ఆ ఫొటోలు, వీడియోలు నీ భర్తకు పంపిస్తానని, సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆమె వద్ద నుంచి పలు దఫాల్లో 4 లక్షల రూపాయలు తీసుకున్నాడు.

అయినా వేధింపులు కొనసాగిస్తుండడంతో భరించలేని ఆమె సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, అబ్దుల్లా లీలలు తెలుసుకుని నోరెళ్లబెట్టారు. దీంతో మణికొండలోని పుప్పాలగూడలో ఉంటున్న అబ్దుల్లాను అరెస్టు చేసి కటాకటాల వెనక్కి పంపారు.

More Telugu News