Tic Tok: టిక్ టాక్ యాప్ ను బ్లాక్ చేసిన గూగుల్... ఆగిన సేవలు!

  • మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం
  • పోర్నోగ్రఫీని ప్రోత్సహిస్తోందని విమర్శలు
  • బైటెండెన్స్ టెక్నాలజీ రివ్యూ పిటిషన్ తిరస్కరణ

ఇండియాలో ఎంతో పాప్యులర్ అయిన టిక్ టాక్ యాప్ యాక్సెస్ ను బ్లాక్ చేస్తున్నట్టు గూగుల్ ప్రకటించింది. డౌన్ లోడ్లను నిషేధించామని, మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని గూగుల్ పేర్కొంది. ఈ యాప్ పోర్నోగ్రఫీని ప్రోత్సహిస్తోందని, చిన్నారుల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

 దీనిపై దాఖలైన పిటిషన్ ను విచారించిన మద్రాస్ హైకోర్టు యాప్ ను బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించగా, టిక్ టాక్ ను అందిస్తున్న చైనా సంస్థ బైటెండెన్స్ టెక్నాలజీ రివ్యూ పిటిషన్ వేసింది. ఈ నెల 3వ తేదీన టిక్ టాక్ ను నిషేధించాలన్న ఉత్తర్వులు వెలువడగా, భారత్ వంటి పెద్ద మార్కెట్ ను వదులుకునేందుకు సిద్ధంగా లేని బైటెండెన్స్, తన వంతు ప్రయత్నాలు చేసి విఫలమైంది.

సుప్రీంకోర్టును సంస్థ ప్రతినిధులు ఆశ్రయించగా, కేసును మద్రాస్ హైకోర్టుకే బదిలీ చేస్తూ అత్యున్నత ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. యాప్ ను నిషేధించడం ఇండియాలో వాక్ స్వాతంత్ర్యానికి విఘాతమని బైటెండెన్స్ చేసిన వాదనతో న్యాయమూర్తులు ఏకీభవించలేదు. కాగా, ఇక గూగుల్ ప్లే స్టోర్ లో ఈ యాప్ ను తొలగించామని గూగుల్ ప్రకటించగా, యాపిల్ మాత్రం ఇంకా స్పందించలేదు. జనవరి నాటికి ఈ యాప్ 24 కోట్ల స్మార్ట్ ఫోన్లలో ఇన్ స్టాల్ అయింది.

More Telugu News