Telangana: తెలంగాణ పదో తరగతి మేథ్స్ పేపర్లో తప్పులు.. అదనపు మార్కులు కలపాలని ఆదేశాలు!

  • గణితం పేపర్-1, 2లలో దొర్లిన తప్పులు
  • వాటికి సమాధానాలు రాసేందుకు ప్రయత్నించిన వారికి అదనపు మార్కులు
  • స్పాట్ కేంద్రాలకు ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ

తెలంగాణలో ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. గణితం పేపర్‌లో తప్పులు దొర్లడంతో అదనంగా ఆరు మార్కులు కలపాలని నిర్ణయించింది. తప్పులు దొర్లిన ఆరు ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి ప్రయత్నించిన విద్యార్థులకు ఈ అదనపు మార్కులు కలపనున్నారు. ఈ మేరకు జిల్లాలో స్పాట్ వేల్యుయేషన్ నిర్వహించే కేంద్రాలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

దీని ప్రకారం.. మ్యాథ్స్ పేపర్-1లో ఐదున్నర, పేపర్-2లో అరమార్కు అదనంగా కలపనున్నారు. పార్ట్-ఎలోని ఆరో ప్రశ్నకు ఒక మార్కు, 16వ ప్రశ్నకు నాలుగు మార్కులు కలపనుండగా, పార్ట్-బిలోని ఏడో ప్రశ్నకు అరమార్కు కలపాలని విద్యాశాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి. అలాగే, పేపర్-2 పార్ట్ -బిలోని నాలుగో ప్రశ్నకు అరమార్కు కలపనున్నారు. అంటే మొత్తంగా ఆరు మార్కులు అదనంగా కలవనున్నాయి. అయితే, ఈ ప్రశ్నలకు జవాబు రాయడానికి ప్రయత్నించిన వారికి మాత్రమే మార్కులు కలపనున్నట్టు అధికారులు తెలిపారు. విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News