PM Narendra modi: యూట్యూబ్‌లో కనిపించని ‘పీఎం మోదీ బయోపిక్' ట్రైలర్

  • మోదీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘పీఎం నరేంద్రమోదీ’
  • సినిమా విడుదలను అడ్డుకున్న ఎన్నికల కమిషన్
  • యూట్యూబ్‌లో కానరాని ట్రైలర్.. ఎవరు తొలగించారో తెలియని వైనం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం ‘పీఎం నరేంద్రమోదీ’. బాలీవుడ్ ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించగా, ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు. నిజానికి ఈ సినిమా గతవారమే విడుదల కావాల్సి ఉండగా ఎన్నికల సంఘం అభ్యంతరాలతో వాయిదా పడింది. ప్రతిపక్ష నాయకులు కూడా సినిమా విడుదలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.  సినిమా విడుదలను ఈసీ అడ్డుకోవడంపై చిత్ర బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారించిన న్యాయస్థానం ఈ సినిమాను చూసి ఈనెల 24వ తేదీలోపు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

ఈ క్రమంలో ఇటీవల యూట్యూబ్‌లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడందులో కనిపించకుండా పోయింది. ఎంతగా వెతికినా ట్రైలర్ కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. ఈ వీడియో అందుబాటులో లేదని యూట్యూబ్ చెబుతోంది. దీంతో యూట్యూబ్ నుంచి కావాలనే ఈ సినిమా ట్రైలర్‌ను తొలగించినట్టు తెలుస్తోంది. అయితే, ఎవరు తొలగించారన్నది మాత్రం తెలియడం లేదు.  

More Telugu News