Telangana: ఈవీఎంలపై దుష్ప్రచారాలను నమ్మొద్దు: రజత్ కుమార్

  • పరిశీలకులు,పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీల్ చేస్తాం
  • ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరుస్తాం
  • ప్రజలను ఆందోళనకు గురిచేసేలా కథనాలు వద్దు

సామాజిక మాధ్యమాలు వేదికగా ఈవీఎంలపై వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్ కుమార్ సూచించారు. హైదరాబాద్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పరిశీలకులు, పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను సీల్ చేసి, స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరుస్తామని స్పష్టం చేశారు. ఈ విషయమై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం జరుగుతోందని, ఈ విషయాలను నమ్మొద్దని సూచించారు.

జగిత్యాలలో ఆటోలో రవాణా చేసిన ఈవీఎంలను  పోలింగ్ కోసం వినియోగించలేదని, అవగాహన కల్పించే నిమిత్తం ఈ యంత్రాలను వినియోగించినట్టు చెప్పారు. దుష్ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని రజత్ కుమార్ హెచ్చరించారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పార్టీల ప్రతినిధులు కూడా ఉండవచ్చని, కీసరలో ఈవీఎంలను సీల్ చేసేటప్పుడు ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో ఫొటో తీసుకున్నాడని, ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రజలను ఆందోళనకు గురిచేసే కథనాలు ఇవ్వద్దని ఈ సందర్భంగా మీడియాకు రజత్ కుమార్ సూచించారు.  

More Telugu News