Monsoon: రైతులకు శుభవార్త చెప్పిన వాతావరణ శాఖ.. తొలిసారి ‘నియర్ నార్మల్’ పదం వాడుక

  • ఈ ఏడాది 96 శాతం వర్షాలు కురిసే అవకాశం
  • జూన్-సెప్టెంబరు మధ్య విస్తారంగా వానలు
  • రెండు పదాలూ ఒకటేనన్న ఐఎండీ చీఫ్

దేశంలోని రైతులకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుభవార్త చెప్పింది. ఈ ఏడాది వర్షపాతం సాధారణానికి సమీపంలో ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్‌పీఏ (దీర్ఘకాల సగటు)లో 96 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అయితే, తొలి విడత వర్ష సూచనలో బహుశా 39 శాతం మాత్రమే సాధారణానికి సమీపంలో వర్షంపాతం ఉండే అవకాశం ఉందని తెలిపింది.

నైరుతి రుతుపవనాల ఆధారంగా కురిసే వర్షం సాధారణ వర్షపాతానికి సమీపంలో ఉండే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అయితే, మొత్తంగా జూన్-సెప్టెంబరు మధ్య 96 శాతం వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. దీనికి 5 శాతం అటూఇటుగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సెక్రటరీ ఎం రాజీవన్ తెలిపారు.  

కాగా, ఐఎండీ తొలిసారి నియర్ నార్మల్ (సాధారణ వర్షపాతానికి సమీపం) అనే పదాన్ని ఉపయోగించడం విశేషం. ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం అనే చెబుతుండగా, ఇప్పుడు సాధారణ వర్షపాతానికి సమీపంలో అని పేర్కొంది. నిజానికి ఈ రెండింటిలోనూ పెద్దగా తేడా లేదని, సాంకేతికంగా రెండూ ఒకటేనని ఐఎండీ చీఫ్ కేజే రమేశ్ తెలిపారు. సాధారణం.. సాధారణం కంటే తక్కువ అని చెప్పే క్రమంలో ఈ పదాన్ని వాడతామని పేర్కొన్నారు.

More Telugu News