Police: 'ఫ్లిప్‌ కార్ట్'లో రూ. 49 వేల కెమెరాను ఆర్డర్ చేస్తే... రెండు పెద్ద బండరాళ్లు వచ్చాయ్!

  • వనపర్తి జిల్లాలో ఘటన
  • డబ్బిచ్చిన తరువాత పార్శిల్ అందించిన డెలివరీ బాయ్
  • ఓపెన్ చేసి చూడగా రాళ్లు కనిపించడంతో అవాక్కు
  • కేసు నమోదు చేసిన పోలీసులు

ఆన్ లైన్ షాపింగ్ తో డబ్బు పోతుందని మరోసారి రుజువు చేసిన ఘటన ఇది. రూ. 48,990 విలువైన కెమెరాను ఆర్డర్ చేసిన వ్యక్తికి రెండు పెద్ద బండరాళ్లు పార్శిల్ లో వచ్చిన ఘటన వనపర్తి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితుడు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, వనపర్తి భగత్‌ సింగ్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన చీర్ల యాదిసాగర్‌ అనే వ్యక్తి, ఈ నెల 11న జీఎస్టీతో కలిపి రూ. 48,990 విలువ గల కెనాన్‌ డిజిటల్‌ కెమెరా కోసం ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ 'ఫ్లిప్‌ కార్ట్'లో ఆర్డర్ పెట్టాడు. నిన్న అతనికి ఇన్‌ స్టాకార్డ్ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా పార్సిల్‌ అందింది.

 మొత్తం డబ్బు ఇచ్చిన తరువాత పార్శిల్ ను ఓపెన్ చేసి చూడగా, నల్లని రాళ్లు కనిపించడంతో యాదిసాగర్ అవాక్కయ్యాడు. తనకు పార్శిల్ తెచ్చిచ్చిన బాయ్ ని ప్రశ్నించగా, బాక్స్ లో ఏముందన్న విషయమై తనకు సంబంధం లేదని తేల్చి చెప్పేశాడు. దీంతో పట్టణ పోలీసులను బాధితుడు ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, సంస్థ టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి విషయం చెప్పాలని యాదిసాగర్ కు సూచించారు. యాదిసాగర్ ఫిర్యాదును తీసుకున్న ఫ్లిప్ కార్ట్, తప్పు ఎక్కడ జరిగిందన్న విషయాన్ని వారం రోజుల్లో తేలుస్తామని వెల్లడించారట.

More Telugu News