chief election commissioner: రోగ నిర్ధారణ కోసం శరీరంలోని 20 చోట్ల నుంచి రక్తం సేకరిస్తామా?: వీవీ ప్యాట్ల లెక్కింపు సంఖ్యపై సీఈసీ సునీల్ అరోరా

  • ఏపీలో పనిచేయని ఈవీఎంలు 45 మాత్రమే
  • ప్రతిపక్షాల ఆరోపణలు అర్థ రహితం
  • ఈవీఎంలు వేటికవే ప్రత్యేకం

ఎన్నికల్లో వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్కింపు సంఖ్యను పెంచాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండుపై ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా స్పందించారు. రోగ నిర్ధారణకు ఒక చోటునుంచి రక్త నమూనా సేకరిస్తే సరిపోతుందని, 20 చోట్ల నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఏపీలోని కేవలం 45 ఈవీఎంలలో మాత్రమే సమస్య వచ్చిందని, ఈ విషయంలో రాద్ధాంతం అవసరం లేదన్నారు.

సోమవారం ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరోరా మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్‌లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అప్పటికప్పుడు నిర్ణయించుకుని ఎంపిక చేసి లెక్కించాల్సి ఉంటుందన్నారు.  సుప్రీం ఆదేశాలను అమలు చేయాలంటూ అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు తెలియజేసినట్టు చెప్పారు.

గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వీవీప్యాట్‌లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 20 ఏళ్లుగా ఈవీఎంలను ఉపయోగిస్తున్నట్టు చెప్పిన అరోరా.. ఈవీఎంలపై విమర్శలు బాధాకరమన్నారు. ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీ గెలుస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా అరోరా గుర్తు చేశారు. 1500 వీవీప్యాట్‌లను లెక్కిస్తే అవన్నీ ఈవీఎంలతో సరిపోలాయని అన్నారు.

 ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని అరోరా కొట్టిపడేశారు. ఈవీఎంలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండవని, అవన్నీ వేటికవే వేర్వేరుగా ఉంటాయని, కాబట్టి ట్యాంపర్ చేయడం సాధ్యం కాదన్నారు. పనిచేయడంలో లోపాలు ఉండొచ్చు తప్పితే ట్యాంపరింగ్‌కు వీలుకాదన్నారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో పనిచేయని ఈవీఎంలు 45 మాత్రమేనని పునరుద్ఘాటించారు. 1.75 లక్షల ఈవీఎంలు తరలిస్తే ఆరింటిలో మాత్రమే విమర్శలు వచ్చాయని, మీడియా కూడా వాటికే విస్తృత ప్రచారం కల్పించందన్నారు. ఈ ఆరింటి విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకున్నట్టు అరోరా వివరించారు.

More Telugu News