ka paul: నేను ఎంత చెప్పినా ఎవరూ వినలేదు.. ఇప్పుడిప్పుడే కొందరు సీఎంలు మాట్లాడుతున్నారు: ఢిల్లీలో కేఏ పాల్

  • ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంది
  • ఈవీఎంలకు పరిష్కారం లభించకపోతే.. ఎన్నికలను బహిష్కరించాలి
  • ప్రధాని మోదీ దేశాన్ని నాశనం చేస్తారు

ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, ఎన్నికల నిర్వహణపై ఈసీ తీరును ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుబడుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కూడా చేరారు. ఈరోజు ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని చెప్పారు. తన నియోజకవర్గంలో 40 కేంద్రాల్లో ఈవీఎంలు పని చేయలేదని... దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

దేశ, రాష్ట్ర పరిస్థితి ఘోరంగా ఉందని తాను పదేపదే చెబుతున్నా ఏ పార్టీ నేతలూ పట్టించుకోలేదని కేఏ పాల్ అన్నారు. కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ మాత్రమే స్పందించారని చెప్పారు. ఈవీఎంలపై తాను మొదటి నుంచి పోరాడుతున్నానని... ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రులు చంద్రబాబు, నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, డీఎంకే చీఫ్ స్టాలిన్ లు స్పందిస్తున్నారని అన్నారు. ఈవీఎంలకు పరిష్కారం చూపకపోతే ఎన్నికలను బహిష్కరించాలని చెప్పారు. మే 23 వరకు ప్రతిపక్షాలు ఈ విషయంలో ఏమీ చేయలేకపోతే... ప్రధాని మోదీ దేశాన్ని నాశనం చేస్తారని అన్నారు.

More Telugu News