YSRCP: ఇక వైసీపీ వంతు...టీడీపీ దాడులు చేస్తోందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయం

  • సాయంత్రం ఐదు గంటలకు సీఈసీని కలవనున్న నేతలు
  • టీడీపీ దౌర్జన్యాలను వివరించాలని నిర్ణయం
  • ఢిల్లీకి చేరుకుంటున్న విజయసాయిరెడ్డి, బొత్స, ఇతర నేతలు

ఏపీలో పోలింగ్‌ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రోద్బలంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వైసీపీ కేడర్‌పై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఆ పార్టీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులను ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు కలిసి వినతి పత్రం అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణతోపాటు ఇతర నేతలు ఢిల్లీ చేరుకుంటున్నారు.

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిశాక సాధారణంగా మైకులే కాదు, నాయకుల నోళ్లు కూడా మూతపడతాయి. కౌంటింగ్‌ జరిగేంత వరకు అభ్యర్థులు, అనుచరులు, అభిమానులు ఎవరి లెక్కల్లో వారు మునిగితేలుతారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ పోలింగ్‌ ముగిశాక భిన్నమైన పరిస్థితి నెలకొంది. అధికార తెలుగుదేశం, విపక్ష వైసీపీలు ఒకరిపై ఒకరు పోటీ పడి ఫిర్యాదు చేసుకుంటున్నారు.

పోలింగ్‌కు ఒకరోజు ముందు నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసీపై ధ్వజమెత్తడం మొదలెట్టి ఢిల్లీ వరకు తన ఫిర్యాదులు కొనసాగిస్తే తాజాగా వైసీపీ కూడా అదే మార్గాన్ని ఎంచుకోవడం గమనార్హం. ఎన్నికల సంఘాన్ని కలిసి టీడీపీ నేతల తీరును వివరించాలని నిర్ణయించారు. ఎన్నికల అనంతరం వైసీపీ నాయకులపై జరుగుతున్న దాడులను వారి దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు.

More Telugu News