priyanka gandhi: ప్రియాంక పోటీ చేయాల్సిందే.. అధిష్ఠానంపై పెరుగుతున్న ఒత్తిడి

  • వారణాసి నుంచి కానీ, అలహాబాద్ నుంచి కానీ ప్రియాంక పోటీ?
  • ఆమె రాకతో కాంగ్రెస్ బలోపేతం అయిందంటున్న నేతలు
  • ఆమెను పోటీలో నిలపాలంటూ అధిష్ఠానంపై నేతల ఒత్తిడి

ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌కు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. అధిష్ఠానం కోరితే ఈ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధమేనంటూ ప్రియాంక ఇటీవల ప్రకటించారు. ఆమె వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ నేతల నుంచి డిమాండ్ పెరుగుతోంది. యూపీలోని ఏదో ఒక స్థానం నుంచి ఆమె పోటీ చేయాల్సిందేనని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పట్టుబడుతున్నారు.

ప్రియాంక ఎన్నికల బరిలోకి దిగడం వల్ల పార్టీ విజయావకాశాలు మరింత పెరుగుతాయని నేతలు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తున్నారు. తాజాగా, యూపీ శాసనసభాపక్ష మాజీ నేత ప్రదీప్ మాథుర్ మాట్లాడుతూ.. ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిందన్నారు. ఆమెను చూస్తుంటే తమకు ఇందిరా గాంధీ గుర్తొస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో యూపీలోని ఏదో ఒక స్థానం నుంచి ఆమె బరిలోకి దిగితే బాగుంటుందని  భావిస్తున్నట్టు చెప్పారు.

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక సేవలు ఎంతో అవసరమని మరో నేత రాజేశ్ మిశ్రా పేర్కొన్నారు. ఆమె పోటీకి దిగితే కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. వారణాసి నుంచి కానీ, అలహాబాద్ నుంచి కానీ ప్రియాంక పోటీ చేసే అవకాశం ఉందని, ఆ రెండు స్థానాల్లో ఎక్కడి నుంచి పోటీ చేసినా ఫలితాలపై ఆ ప్రభావం ఉంటుందని మరో నేత పేర్కొన్నారు.

More Telugu News