Australia: మోదీకి ఓటేయడం కోసం చేస్తున్న ఉద్యోగానికి గుడ్ బై చెప్పేశాడు!

  • సెలవు పొడిగించకపోవడంతో అసంతృప్తి
  • మోదీ అంటే వీరాభిమానం
  • కర్ణాటక వ్యక్తి విస్మయకర నిర్ణయం

దేశంలో ఎక్కడ చూసినా సార్వత్రిక ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను ఆకట్టుకోవడానికి ముమ్మర ప్రచారం సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని మంగళూరు ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఎన్నికల్లో ఓటు వేసేందుకు చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి స్వదేశానికి వచ్చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

41 ఏళ్ల సుధీంద్ర హెబ్బార్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ విమానాశ్రయంలో స్క్రీనింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. అతడికి మోదీ అంటే వీరాభిమానం. అయితే భారత్ లో ఎన్నికలు జరుగుతుండడంతో ఓటు వేసేందుకు స్వదేశం వచ్చేందుకు సెలవు పెట్టాడు. ఎయిర్ పోర్టు అధికారులు ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 12 వరకు సెలవు మంజూరు చేశారు. కర్ణాటకలో లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 23న నిర్వహిస్తున్నారు. దాంతో సెలవు పొడిగింపు కోరాడు.

కానీ, మరికొన్నిరోజుల్లో ఈస్టర్, రంజాన్ సీజన్ల కారణంగా విమానాశ్రయానికి విపరీతమైన రద్దీ ఉంటుందన్న కారణంతో అతడి సెలవును పొడిగించేందుకు అధికారులు నిరాకరించారు. దాంతో సుధీంద్ర ఆ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేశాడు. మే23న ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు మంగళూరులోనే ఉండి ఆపై తిరిగి ఆస్ట్రేలియా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ మరో జాబ్ వెతుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదని సుధీంద్ర ధీమాగా చెబుతున్నాడు.

More Telugu News