Liver: నొప్పి తగ్గించే ఈ ఔషధం లివర్ ఫెయిల్యూర్ కు కారణమవుతోందట!

  • విషపదార్థంగా మారుతున్న అసిటామినోఫెన్?
  • కాలేయ వైఫల్యానికి ఇదీ ఓ కారణమంటున్న పరిశోధకులు
  • మాలిక్యులర్ అండ్ సెల్యులర్ ప్రోటెమిక్స్ పత్రికలో వివరాలు

వైద్యరంగంలో సమర్థంగా నొప్పి తగ్గించే ఔషధంగా అసిటామినోఫెన్ ఎంతో ప్రాచుర్యం పొందింది. బాధా నివారిణిగా ఇది చాలా విరివిగా వాడుకలో ఉంది. అయితే ఈ ఔషధం కాలేయ వైఫల్యానికి కారణమవుతోందని పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా మాత్రలు మింగినప్పుడు కాలేయం వాటిని శరీరంలోని నిర్దేశిత భాగాలకు పంపిస్తుంది. ఈ క్రమంలో అసిటామినోఫెన్ వాడినప్పుడు అది కాలేయంలో సరికొత్త పదార్థంగా రూపాంతరం చెందుతున్నట్టు తెలుసుకున్నారు.

సిస్టీన్ అనే అమినో యాసిడ్ తో కలిసి ప్రొటీన్ లను ప్రభావితం చేస్తుందని, తద్వారా కాలేయంలో విషపదార్థాలు ఉత్పన్నమై ప్రమాదకర స్థాయికి చేరుకుంటాయని సింగపూర్ కు చెందిన నేషనల్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. మోతాదుకు మించిన విషపదార్థాల కారణంగా లివర్ ఉన్నట్టుండి వైఫల్యం బారినపడుతుందట.

అసిటామినోఫెన్ అధికమోతాదులో వాడినప్పుడు అది విషపదార్థంగా ఎలా మారుతుందన్నది ఈ పరిశోధనలో వెల్లడైంది. ఈ మేరకు మాలిక్యులర్ అండ్ సెల్యులర్ ప్రోటెమిక్స్ అనే పత్రికలో వివరాలు ప్రచురితం అయ్యాయి.

More Telugu News