Arvind Kejriwal: అమిత్‌ షా హోం మంత్రి అయితే ఈ దేశాన్ని ఆ దేవుడే రక్షించాలి: కేజ్రీవాల్‌

  • మోదీ మళ్లీ గెలిస్తే జరిగేది ఇదే
  • ప్రజలు ఈ విషయంలో ఆలోచించి ఓటేయాలి
  • గోవా ఎన్నికల సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి

భారతీయ జనతాపార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చి మోదీ మళ్లీ ప్రధాని అయితే అమిత్‌ షా హోంమంత్రి అవుతారని, ఆ తర్వాత ఈ దేశాన్ని ఆ దేవుడే రక్షించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. గత ఎన్నికల్లో అమిత్‌ షా పోటీ చేయలేదు కాబట్టి ఇది జరగలేదని, ఈసారి గాంధీనగర్‌ నుంచి పోటీ చేస్తున్నందున గెలిస్తే జరిగేది ఇదేనని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు.

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం గోవాలో పర్యటిస్తున్న ఆయన కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ఇక్కడ రెండు ఎంపీ స్థానాలు, మూడు అసెంబ్లీ స్థానాల్లో ఆప్‌ తన అభ్యర్థులను నిలిపింది. ఈ ఎన్నికలు దేశం మొత్తానికి, రాజ్యాంగ పరిరక్షణకు పరీక్ష కానున్నాయని ఆయన అన్నారు. 1931లో జర్మనీ చాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టిన హిట్లర్‌ మూడు నెలల కాలంలోనే రాజ్యాంగాన్ని మార్చి ఎన్నికలు రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

హిట్లర్‌ విధానాలనే మోదీ అనుసరిస్తున్నారని, జీవిత కాలం ప్రధానిగా ఉండాలని ఆలోచిస్తున్నారని ధ్వజమెత్తారు. మోదీకి, పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కి మధ్య రహస్య బంధం ఉందని, లేదంటే మోదీ గెలవాలని ఆయన ఎందుకు కోరుకుంటారని ప్రశ్నించారు. మత ప్రాతిపదికన భారత్‌ను విభజించాలని 70 ఏళ్లుగా ఎదురు చూస్తున్న పాకిస్థాన్‌కు అది సాధ్యం కాలేదన్నారు. మోదీ, అమిత్‌షాలు మాత్రం ఐదేళ్లలో దీన్ని చేసి చూపించారని విమర్శించారు. అందువల్ల దేశ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.

More Telugu News