Hyderabad: సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్... ఐటీ గ్రిడ్స్ వద్ద 7.8 కోట్ల మంది ఆధార్ వివరాలు!

  • టీడీపీకి సేవామిత్ర యాప్ ను అందించిన ఐటీ గ్రిడ్స్
  • 7,82,21,397 మంది ఆధార్ సమాచారం
  • కేసును సిట్ కు అప్పగించే అవకాశం

తెలుగుదేశం పార్టీకి సేవా మిత్ర యాప్ ను అభివృద్ధి చేసి ఇచ్చిన ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వద్ద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 7.80 కోట్ల మంది ఆధార్ వివరాలు ఉన్నాయని సైబరాబాద్ పోలీసులు, తమ ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు. రెండు రాష్ట్రాల్లో 8.40 కోట్ల మంది జనాభా ఉండగా, వారిలో 90 శాతానికి పైగా ప్రజల సమాచారం ఐటీ గ్రిడ్స్ వద్ద ఉందని తేల్చారు.

ఈ డేటాను ఆధార్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా రిమూవబుల్ స్టోరేజ్ డిస్క్ లలో భద్రపరిచారని, చట్టవిరుద్ధంగానే ఈ డేటాను వారు సేకరించారని పేర్కొన్నారు. కాగా, ఈ కేసును మరింతగా విచారించాల్సివుందని, అందువల్ల ఈ కేసును కూడా సిట్ కు అప్పగించాలని కోరే అవకాశాలు ఉన్నాయని సైబరాబాద్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ఐటీ గ్రిడ్స్ కార్యాలయం నుంచి సేకరించిన హార్డ్ డిస్క్ లను రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో పరిశీలించామని, ఇందులో 7,82,21,397 మంది ఆధార్ సమాచారం ఉందని తేలిందని తెలిపారు. యూఐడీఏఐ వద్ద మాత్రమే ఉండాల్సిన సమాచారం సమస్తం వీరి వద్ద ఉందని అన్నారు. ఈ విషయంలో టీడీపీ వాదన మాత్రం మరోలా వుంది. తాము ఆధార్ డేటాను తీసుకోలేదని, సంక్షేమ పథకాల లబ్దిదారుల వెరిఫికేషన్ నిమిత్తం మాత్రమే వాడామని చెబుతోంది.

More Telugu News