Madhya Pradesh: వేరే కులం వాడిని పెళ్లాడిందని.. యువతికి వింత శిక్ష!

  • భర్తను భుజంపైకి ఎక్కించుకుని నడవాలని పెద్దల ఆదేశం
  • బరువు మోయలేక ఆగితే అరుపులు, కేకలు
  • ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

యువకుడిని తన భుజంపై మోస్తున్న ఆ యువతి చుట్టూ చేరిన పిల్లలు, పెద్దలు, యువకులు కేరింతలు కొడుతున్నారు. పెద్దగా అరుస్తూ డ్యాన్స్‌లు చేస్తున్నారు. కొందరు ఈ తతంగాన్ని వీడియో తీస్తున్నారు. ఎందుకిలా? యువకుడిని ఆమె ఎందుకు తన భుజాలపై మోస్తోంది? వారెందుకు కేరింతలు కొడుతున్నారు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మధ్యప్రదేశ్‌ ఝబువా జిల్లాలోని దేవిగఢ్‌కు వెళ్లాల్సిందే.

గ్రామానికి చెందిన ఓ యువతి వేరే కులం వ్యక్తిని పెళ్లాడింది. విషయం తెలిసిన గ్రామ పెద్దలు దీనిని తీవ్రంగా పరిగణించారు. వెంటనే శిక్ష అమలు చేశారు. పరాయి కులస్తుడిని పెళ్లాడినందుకు శిక్షగా భర్తను భుజంపై మోసుకుని నడవాలని ఆదేశించారు. అంతేకాదు, అప్పటికప్పుడు శిక్షను అమలు చేశారు. చేసేది లేక భర్తను తన భుజాలపై కూర్చోబెట్టుకుని నడక ప్రారంభించింది. అతడి బరువును మోయలేక ఆమె ఆగితే వెంటనే చుట్టూ ఉన్న జనం అరుపులు, కేకలతో హోరెత్తించారు. భర్తను ఎత్తుకుని ఆమె నడుస్తుంటే కొందరు వీడియోలు తీశారు.

విషయం పోలీసులకు చేరడంతో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు ఝబువా ఎస్పీ వినీత్ జైన్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News