Telugudesam: హరిప్రసాద్‌ను చర్చలకు అనుమతించండి.. ఈసీకి టీడీపీ మూడు పేజీల లేఖ

  • హరిప్రసాద్‌పై నమోదైన కేసులో ఇప్పటి వరకు చార్జిషీటు లేదు
  • ఈసీ చెబుతున్నవన్నీ కుంటి సాకులే
  • రేపటి సమావేశానికి పిలుస్తారని ఆశిస్తున్నాం: కనకమేడల

ఈవీఎంలలో లోపాల విషయమై చర్చించేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఈసీని కలిశారు. చంద్రబాబుతోపాటు సాంకేతిక సలహాదారు హోదాలో హాజరైన హరిప్రసాద్‌ను ఈసీ భేటీకి అనుమతించలేదు. ఆయనపై క్రిమినల్ కేసు ఉందని, కాబట్టి ఎన్నికల సంఘంతో చర్చలు జరపడానికి హరిప్రసాద్‌‌ను అనుమతించేది లేదని ఈసీ చెప్పడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

చర్చలు జరపడానికి ఇష్టం లేని ఎన్నికల సంఘం తప్పించుకునేందుకు ఇటువంటి సాకులు చెబుతున్నట్టు అనిపిస్తోందని  టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు, ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి శనివారం రాత్రి మూడు పేజీల లేఖ రాశారు. హరిప్రసాద్‌కు ఉన్న నిపుణతను దృష్టిలో పెట్టుకుని సోమవారం ఆయనను చర్చలకు ఆహ్వానిస్తారని ఆశిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు.

తొమ్మిదేళ్ల క్రితం హరిప్రసాద్‌పై ఈవీఎం చోరీ కేసు ఆరోపణలపై కేసు నమోదైందని, కానీ ఇప్పటి వరకు చార్జిషీటు కూడా దాఖలు కాలేదని లేఖలో గుర్తు చేశారు. గతంలో ఈవీఎంలపై జరిగిన సమావేశాలకు అప్పటి ప్రధాన కమిషనర్లు ఎస్‌వై ఖురేషీ, వీఎస్ సంపత్‌లు కూడా ఆహ్వానించిన విషయాన్ని లేఖలో పేర్కొన్నారు.

హరిప్రసాద్‌కు ఎంతో ఘన చరిత ఉందని రవీంద్రకుమార్ వివరించారు. అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్స్ ఫ్రాంటియర్ ఫౌండేషన్ ఈపీఎఫ్ పయనీర్ అవార్డు-2010 అవార్డుతో సత్కరించినట్టు తెలిపారు. ఈ అవార్డు స్థాపించిన తర్వాత 27 ఏళ్లలో ఏ భారతీయుడికీ దక్కని గౌరవం ఆయనకు దక్కిందని కనకమేడల పేర్కొన్నారు. ఈవీఎంలపై లోపాలను వెలికి తీయడానికి ప్రయత్నించిన తర్వాతే ఆయనపై కేసు నమోదైందని, ఆ తర్వాత కూడా ఆయనను ఈసీ ఆహ్వానించిందని, పలు సమావేశాల్లో పాల్గొన్నారని రవీంద్రకుమార్ గుర్తు చేశారు. కాబట్టి రేపటి సమావేశంలో ఆయనను ఈసీ ఆహ్వానిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు రవీంద్రకుమార్ లేఖలో పేర్కొన్నారు.

More Telugu News