Congress: కాంగ్రెస్ అందరికీ న్యాయం చేస్తామని చెబుతోంది.. కానీ 60 ఏళ్లు అన్యాయమే చేసింది: మోదీ

  • తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌పై మండిపడిన మోదీ
  • మోసం-కాంగ్రెస్ ఈ రెండూ మంచి స్నేహితులని ఎద్దేవా
  • ఎవరికి న్యాయం చేశారో చెప్పాలని డిమాండ్

ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం తమిళనాడులోని థేనిలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ ఇటీవల ప్రకటించిన ‘న్యాయ్’ పథకాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేశారు.

తాము అధికారంలోకి వస్తే అందరికీ న్యాయం (న్యాయ్ పథకాన్ని ఉద్దేశిస్తూ) చేస్తామని చెబుతున్నారని, కానీ 60 ఏళ్లపాటు దేశానికి అన్యాయమే చేశారని తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్-మోసం.. ఈ రెండు బెస్ట్ ఫ్రెండ్స్ అన్న మోదీ.. కాంగ్రెస్ నిజం చెప్పడాన్ని ఏనాడో మర్చిపోయిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని అంటున్నారని, కానీ వారు పాలించిన 60 ఏళ్లలో దేశానికి అన్యాయమే చేశారని మండిపడ్డారు.

న్యాయం చేస్తానంటున్న కాంగ్రెస్ పార్టీని తాను ఒకటే అడగదలిచానని, 1984 సిక్కు అలర్ల బాధితులకు కాంగ్రెస్ న్యాయం చేసిందా? అని ప్రశ్నించారు. దళిత వ్యతిరేక ఉద్యమ బాధితులకు న్యాయం చేసిందా? లేక, భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు న్యాయం చేసిందా? అని ప్రశ్నించారు. కేవలం తమకు ఇష్టం లేదన్న ఒకే ఒక్క కారణంతో తమిళనాడులోని ఎంజీ రామచంద్రన్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ బర్తరఫ్ చేసిందని మోదీ ఆరోపించారు. వీళ్లా ప్రజలకు న్యాయం చేసేది? అని ప్రశ్నించారు.

More Telugu News