Andhra Pradesh: వైసీపీ నేతలు ఏకంగా స్పీకర్ పైనే దాడి చేశారు.. బూత్ క్యాప్చరింగ్ కు ప్రయత్నించారు!: సీఎం చంద్రబాబు ఆరోపణ

  • ఏపీలో 30 శాతం ఈవీఎంలు పనిచేయలేదు
  • దీనిపై ఏపీ సీఈవోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
  • ఢిల్లీలో మీడియాతో టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వాడిన ఈవీఎంల్లో చాలా సమస్యలు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. పోలింగ్ సందర్భంగా ప్రజల్లో పూర్తి గందరగోళం చెలరేగిందని వ్యాఖ్యానించారు. మొత్తం ఈవీఎంల్లో 30 శాతం వరకూ పనిచేయలేదని ప్రజలు చెప్పారన్నారు. దీంతో అధికారులు చాలా ఈవీఎంలను మార్చారన్నారు. ఎన్నికల అధికారులు ఓ పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రత్యామ్నాయ ఈవీఎంలను ఏర్పాటుచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాను ఈరోజు కలుసుకున్న అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

ఉదయాన్నే ప్రారంభం కావాల్సిన పోలింగ్ మధ్యాహ్నం ప్రారంభం కావడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజలు, ఓటర్లు అడుక్కునే వాళ్లు కాదనీ, గౌరవనీయులైన దేశ పౌరులని వ్యాఖ్యానించారు. ఏపీలోని కొన్ని చోట్ల మరుసటి రోజు తెల్లవారుజామువరకూ పోలింగ్ జరిగిందనీ, ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? అని అడిగారు. దీనిపై ఏపీ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఓవైపు ఈ తతంగం జరుగుతుంటే వైసీపీ నేతలు తమ నేతలపై, ఏకంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై దాడి చేశారని ఆరోపించారు. అంతిమంగా బూత్ క్యాప్చరింగ్ కు ప్రయత్నించారని విమర్శించారు. అయితే తాము వారిని నిలువరించామన్నారు. ఏపీ ఎన్నికల్లో భారీస్థాయిలో ఈవీఎంలు ఎందుకు విఫలమయ్యాయని ప్రశ్నిస్తే, ఈసీ దగ్గర సమాధానం లేదని చంద్రబాబు తెలిపారు. పలు కేసుల్లో నేరస్తులుగా ఉన్నవారు చెప్పినట్లు ఈసీ నడుచుకుందని దుయ్యబట్టారు.

More Telugu News