Andhra Pradesh: ఓట్ల తొలగింపు విచారణకు ఈసీ సహకరించలేదు.. ఐపీ అడ్రసులు ఇచ్చేందుకు నిరాకరించింది!: ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం

  • కడప ఎస్పీ రాహుల్ దేవ్ ను బదిలీ చేశారు
  • కేసులను సాక్షి పత్రిక, టీవీ దాచేస్తున్నాయి
  • ఏపీలో 7.5 లక్షల ఓట్ల తొలగింపునకు యత్నించారు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మను ఈసీ అకారణంగా బదిలీ చేసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఈసీ ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు. జగన్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారని మండిపడ్డారు. ఈ విషయాలన్నింటిని సాక్షి టీవీ, సాక్షి పత్రిక దాచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. వీరికి ఢిల్లీలోని సీఈసీ కార్యాలయం ఓ ఆయుధంగా మారాయన్నారు. ఢిల్లీలో ఈరోజు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాను కలిసిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

ఏపీ ఎన్నికల పరిశీలకుడిగా ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న కేకే శర్మను ఈసీ పంపిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 25 లక్షల మంది ఓటర్లను రద్దు చేశారనీ, ఎన్నికలు అయ్యాక అక్కడి సీఈవో చల్లగా ప్రజలకు సారీ చెప్పారని అన్నారు. ఏపీలో 7.5 లక్షల ఓటర్ల తొలగింపునకు ప్రయత్నాలు జరిగాయని వ్యాఖ్యానించారు. ఢిల్లీకి వచ్చి ఈసీకి తమపై తప్పుడు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు ఫామ్-7 ద్వారా ఈ ఓట్ల తొలగింపునకు పాల్పడ్డారని ఆరోపించారు.

వీటిని అడ్డుకున్న తాము విచారణ జరిపేందుకు ప్రయత్నించగా, కేంద్ర ఎన్నికల సంఘం తమకు సహకరించలేదన్నారు. ఐపీ అడ్రసులు ఇచ్చేందుకు సైతం ఈసీ నిరాకరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఏకపక్షంగా ఈసీ వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు.

More Telugu News