masood azar: మసూద్‌ అజర్‌ విషయంలో చైనా మెడలు వంచేందుకు అమెరికా అల్టిమేటం

  • భద్రతా మండలిలోని సభ్యదేశాలకు తీర్మానాన్ని తెలిపిన అగ్రరాజ్యం
  • ఈనె 23లోగా అభ్యంతరాలుంటే తెలపాలని సూచన
  • అనంతరం తీర్మానంపై ఓటింగ్‌ కోరే అవకాశం

జైషేమహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌పై నిషేధం విషయంలో పట్టుదలతో ఉన్న అగ్రరాజ్యం అమెరికా చివరి అవకాశంగా చైనాకు అల్టిమేటం జారీ చేసింది. పాకిస్థాన్‌ సైన్యం అభయంతో అక్కడే ఉండి భారత్‌పై ఉగ్ర యుద్ధం చేస్తున్న మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్‌ ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తోంది. ఇందుకోసం ఐరాసాలోని భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రతిపాదిస్తోంది.

అయితే, భద్రతా మండలిలోని 15 సభ్యదేశాల్లో 14 దేశాలు మద్దతు ఇస్తున్నా వీటో అధికారం ఉన్న చైనా ప్రతిసారీ ఈ తీర్మానాన్ని అడ్డుకుంటూ వస్తోంది. పుల్వామా దాడి తర్వాత ప్రతిపాదించిన తీర్మానాన్ని కూడా ఇలాగే అడ్డుకుంది. మళ్లీ తీర్మానాన్ని పెట్టాలంటే మరో ఆరు నెలల వరకు ఆగాలి.  చైనా కుయుక్తులు పసిగట్టిన అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు డ్రాగన్‌ తీరుపై ఆగ్రహంతో ఉన్నాయి. దీనికి విరుగుడుగా భద్రతా మండలిలో ప్రత్యేక తీర్మానాన్ని ప్రతిపాదించి సభ్యదేశాలకు పంపాయి.

ఈ తీర్మానాన్ని మెజార్టీ సభ్యదేశాలు అమోదిస్తే మసూద్‌పై నిషేధం అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఈ తీర్మానమే చైనా ముందుకు వెళ్లింది. అజర్‌ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు చైనాపై ఒత్తిడి పెంచాయి. ఇందుకోసం ఈనె 23వ తేదీ వరకు ఆ దేశానికి గడువు ఇచ్చాయి. ఈలోగా చైనా తన అభ్యంతరాలను తెలియజేయవచ్చు. ఒకవేళ స్పందించకున్నా ఏప్రిల్‌ 23 తర్వాత మండలిలో ఈ ప్రత్యేక తీర్మానంపై చర్చ ప్రారంభిస్తారు. అనంతరం ఓటింగ్‌ నిర్వహిస్తారు.

సగం కంటే ఎక్కువ దేశాలు అనుకూలంగా ఓటేస్తే మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రతి తీర్మానానికి చైనా తప్ప అన్ని దేశాలు మద్దతు తెలుపుతున్నందున మద్దతు కష్టం కాదన్న భావన ఉంది. అంటే మసూద్‌పై నిషేధం తప్పనిసరి. వీటో అధికారం ఉన్న దేశం అభ్యంతరాలను పక్కనపెట్టి ఇలా భద్రతా మండలి సభ్యదేశాలు ముందుకు వెళ్లడం అరుదైన ఘటనగా అంతర్జాతీయ ప్రపంచం భావిస్తోంది.

More Telugu News