Ambati Rambabu: పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఎవరైనా తలుపులు వేసుకుంటారా?: కోడెలపై దాడి పట్ల అంబటి స్పందన

  • అప్రజాస్వామికంగా వ్యవహరించడంతో ప్రజలే తిరగబడ్డారు
  • దాడికి పాల్పడింది వైసీపీ కాదు
  • కోడెల నేరపూరిత ఆలోచనలు ఉన్న వ్యక్తి

వైసీపీ అగ్రనేత, సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి అంబటి రాంబాబు నిన్న ఇనిమెట్లలో జరిగిన ఘటనపై స్పందించారు. ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ఆ ఘటనకు కారణాలేంటో వివరించారు.

పోలింగ్ బూత్ లోకి ప్రవేశించిన టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు అప్రజాస్వామిక రీతిలో వ్యవహరించారని, అది చూసి ఆగ్రహించిన ప్రజలే ఆయనపై తిరగబడ్డారని వివరించారు. అంతేతప్ప, కోడెలపై ఇనిమెట్ల పోలింగ్ కేంద్రంలో దాడికి పాల్పడింది వైసీపీ కార్యకర్తలు కాదని స్పష్టం చేశారు. అయినా, కోడెల నేరపూరిత ఆలోచనలు ఉన్న వ్యక్తి అని అంబటి ఆరోపించారు.

"కోడెల పోలింగ్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకోవాలని భావించే వ్యక్తి. అతనిది క్రిమినల్ మైండ్. ఎవరైనా పోలింగ్ కేంద్రంలో దూరి తలుపులు వేసుకుంటే ఎలా భావించాలి? బూత్ లోకి వెళ్లి ప్రజలపై దౌర్జన్యం చేయడంతో ఆ ప్రజలే తిరగబడ్డారు" అని పేర్కొన్నారు.

పోలింగ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అనేక సంఘటనల్లో టీడీపీ నేతలే దాడులు చేసి తమపై నెట్టారని అంబటి తెలిపారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు తిరస్కరించబోతున్నారన్న విషయం స్పష్టంగా తెలిసిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు.

More Telugu News