inter results: ఏపీ ఇంటర్‌లో 72 శాతం ఉత్తీర్ణత.. బాలికలదే మొదటి స్థానం

  • 81 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో కృష్ణా జిల్లా
  • 9,340 మందికి 10/10 గ్రేడ్‌
  • 67 శాతం ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు పాస్

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలికలే అగ్రస్థానం సాధించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగిన ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఇంటర్‌ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఈరోజు ఉదయం 11 గంటలకు అమరావతిలో విడుదల చేశారు. రెండు సంవత్సరాలకు కలిపి 10 లక్షల 17 వేల 600 మంది విద్యార్థులుండగా 9.65 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ఉదయలక్ష్మి తెలిపారు.

వీరిలో 6.3 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణలు కాగా.. 3.3 లక్షల మంది ఫెయిలయ్యారు. వీరిలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 81 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటి స్థానం సాధించింది. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న 67 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి కార్పొరేట్‌ కళాశాలలకు తామేమీ తక్కువ కాదని నిరూపించారు.

ద్వితీయ సంవత్సరంలో మొత్తం 9,340 మంది విద్యార్థులు 10/10 గ్రేడ్‌ సాధించడం విశేషం. ఇక, మొదటి సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్థుల్లో 60 శాతం మంది పాసయ్యారు. కాగా, మే 14వ తేదీన ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించనున్నట్లు కార్యదర్శి ఉదయలక్ష్మి ప్రకటించారు. రుసుము చెల్లించేందుకు ఈ నెల 24ను తుది గడువుగా నిర్ణయించారు.

ద్వితీయ సంవత్సర ఫలితాల్లో.. జనరల్‌లో 72 శాతం ఉత్తీర్ణత నమోదు అవ్వగా.. వొకేషనల్‌లో 69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కృష్ణా (81), చిత్తూరు (76), నెల్లూరు, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలు 74 శాతం ఉత్తీర్ణత శాతాలతో తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. బాలికలు 75, బాలురు 68 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ప్రథమ సంవత్సర ఫలితాల్లో.. జనరల్‌లో మొత్తం 60 శాతం ఉత్తీర్ణత శాతం నమోదు అయ్యింది. వొకేషనల్‌లో 49 శాతం ఉత్తీర్ణత సాధించారు. కృష్ణా (72), పశ్చిమ గోదావరి (69), నెల్లూరు (67) జిల్లాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. జనరల్‌లో బాలికలు 64 శాతం, బాలురు 56 ఉత్తీర్ణత సాధించారు. 

ఫలితాలను ఈ వెబ్‌సైట్లలో చూడవచ్చు
https://results.apcfss.in
http://bieap.gov.in
https://jnanabhumi.ap.gov.in

More Telugu News