UK police: ఈక్వెడార్ ఎంబసీ నుంచి అసాంజేను ఈడ్చుకొచ్చిన యూకే పోలీసులు.. బ్రిటన్ పోలీసుల తీరుపై సర్వత్ర విమర్శలు

  • గురువారం అసాంజేను అదుపులోకి తీసుకున్న బ్రిటన్ పోలీసులు
  • రెక్కలు పట్టుకుని ఈడ్చుకు వచ్చిన వైనం
  • అరుస్తున్నా పట్టించుకోని పోలీసులు

లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఏడేళ్లుగా ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో శరణార్థిగా ఉంటున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే (47)ను బ్రిటన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌, ఇరాక్‌లపై యుద్ధం సమయంలో అమెరికా పాల్పడిన మానవ హక్కుల ఉల్లంఘనలను, యుద్ధ ఖైదీల పట్ల అరాచకాలు, సాధారణ పౌరులపైనా, జర్నలిస్టులపైనా కాల్పులకు తెగబడిన వీడియోలను ‘వికీలీక్స్’ పేరుతో బయటపెట్టి అసాంజే సంచలనం సృష్టించారు.

దీంతో అసాంజేపై కన్నెర్రజేసిన అమెరికా ఆయన అరెస్ట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు అత్యాచారం, లైంగిక వేధింపులపై ఇద్దరు మహిళల ఫిర్యాదు మేరకు స్వీడన్‌ పోలీసులు అసాంజేపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు 2012 నుంచి ఏడేళ్లుగా ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో అసాంజే తలదాచుకుంటున్నారు.

 అయితే, అసాంజే పలుమార్లు అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించారని పేర్కొంటూ ఆయనకు ఇచ్చిన శరణార్థి హోదాను తాజాగా ఈక్వెడార్ ఉపసంహరించుకుంది. ఆ వెంటనే బ్రిటన్ పోలీసులు అసాంజేను అదుపులోకి తీసుకున్నారు. అసాంజేను అదుపులోకి తీసుకునే క్రమంలో ఆయనను ఎంబసీ నుంచి ఈడ్చుకు వస్తున్న దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.

పూర్తి గడ్డంతో బలహీనంగా ఉన్న అసాంజేను ఏడుగురు పోలీసులు అధికారులు చుట్టుముట్టి ఈడ్చుకు రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసాంజే అరుస్తున్నా ఏమాత్రం వినిపించుకోని పోలీసులు ఆయనను రెక్కలు పట్టి కార్యాలయం నుంచి బయటకు ఈడ్చుకొచ్చారు.  

More Telugu News