Rahul Gandhi: రాహుల్ మాట్లాడుతుంటే నుదుటిపై లేజర్ కాంతికిరణం... ప్రాణాలకు ముప్పు ఉందంటున్న కాంగ్రెస్

  • 7 సార్లు జరిగిందంటున్న కాంగ్రెస్
  • రాజ్ నాథ్ కు లేఖ
  • అది కెమెరామన్ మొబైల్ ఫోన్ కాంతి అంటున్న హోంమంత్రిత్వ శాఖ

ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీకి ప్రాణాపాయం ఉందంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇటీవల తన సొంత నియోజవకర్గం అమేథీలో రాహుల్ పర్యటించిన సందర్భాల్లో ఆయన మాట్లాడుతుండగా ఓ లేజర్ కాంతికిరణం ఆయన నుదుటిపై ఫోకస్ అయినట్టు వీడియోల్లో కనిపించింది.

వేర్వేరు సందర్భాల్లో ఇలా 7 సార్లు ఫోకస్ అయినట్టు గుర్తించారు. కచ్చితంగా రాహుల్ నుదుటిని టార్గెట్ చేసుకునే క్రమంలో లేజర్ కాంతి ఆయన ముఖంపై అటూ ఇటూ కదులుతున్నట్టుగా వీడియోల్లో రికార్డయింది. ఈ నేపథ్యంలో, తమ అధినేత ప్రాణాలకు ముప్పు ఉందని కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నాయి.

ఈమేరకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కాంగ్రెస్ నేతలు లేఖ రాశారు. రాహుల్ గాంధీకి కల్పిస్తున్న భద్రతలో లోపాలు ఉన్నాయని తమ లేఖలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన నుదుటిపై లేజర్ పాయింట్ పడడాన్ని ప్రస్తావించారు. రాహుల్ నుదుటిపై పడిన లేజర్ కాంతికిరణం ఓ స్నైపర్ రైఫిల్ నుంచి వచ్చినట్టుగా ఉందని మాజీ భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, రాహుల్ నుదుటిపై పడిన లేజర్ కిరణం అక్కడే ఉన్న కెమెరామన్ మొబైల్ ఫోన్ నుంచి వచ్చిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.

స్నైపర్ అంటే దూరంగా ఉన్న లక్ష్యాన్ని ఛేదించే వ్యక్తి అని అర్థం. ఒకప్పుడు స్నైపర్ రైఫిళ్లకు టెలిస్కోపిక్ లెన్స్ ఉండేది. ఇప్పుడు దానికితోడు లేజర్ బీమ్ సదుపాయం కూడా వచ్చి చేరింది. లేజర్ కాంతికిరణం నిర్దేశిత లక్ష్యంపై పడిన తర్వాత ట్రిగ్గర్ నొక్కితే తూటా కచ్చితంగా టార్గెట్ ను తాకుతుంది.

More Telugu News