Andhra Pradesh: ఆంధ్రాలో ఈసారి ఓటింగ్ సరళి పెరుగుతుంది.. మే 19న సర్వే ఫలితాలు ప్రకటిస్తా!: లగడపాటి రాజగోపాల్

  • ఓటు హక్కును వినియోగించుకున్న లగడపాటి
  • కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయని వ్యాఖ్య
  • ఓటేసేందుకు ఏపీకి 10 లక్షల మంది వచ్చారన్న లగడపాటి

ఆంధ్రా ఆక్టోపస్, లోక్ సభ మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఈరోజు విజయవాడలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలను వీవీప్యాట్ యంత్రాలతో అనుసంధానం చేయడం వల్ల కొన్నిచోట్ల మెషీన్లు పనిచేయడం లేదన్నారు. అందువల్లే పోలింగ్ ప్రక్రియ ఆలస్యమవుతుందని అభిప్రాయపడ్డారు.

ప్రజలు చాలా సహనంగా, ఓపికతో వేచి చూస్తున్నారనీ, ఎలాంటి చెదురుమదురు ఘటనలు చోటుచేసుకోకపోవడం సంతోషకరమని లగడపాటి అన్నారు. ఈసారి ఓటింగ్ సరళి పెరుగుతుందని లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ విషయంలో ఎలాంటి గొడవలు లేవన్నారు.

ఏపీలో త్రిముఖ పోటీ ఉండటం, కొత్త రాష్ట్రం కావడం, సరైన పాలకుడు కావాలన్న ప్రజల తాపత్రయం వెరసి ఈసారి ఓటింగ్ సరళి కచ్చితంగా పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లోని 10 లక్షల మంది ఓటు వేసేందుకు ఏపీకి వచ్చారన్నారు. ఈసీ నిబంధనల మేరకు మే 19న సాయంత్రం 6 గంటల తర్వాత సర్వే ఫలితాలు ప్రకటిస్తానని స్పష్టం చేశారు.

More Telugu News