India: బకాయిలు చెల్లించకపోవడంతో జెట్ ఎయిర్ వేస్ విమానాన్ని స్వాధీనం చేసుకున్న కార్గో సంస్థ

  • ఆమ్ స్టర్ డామ్ లో ఘటన
  • గురువారం ముంబయి బయల్దేరాల్సిన విమానం
  • కొనసాగుతున్న జెట్ ఎయిర్ వేస్ కష్టాలు

భారత్ లో విమానయాన సంస్థల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదని చెప్పడానికి జెట్ ఎయిర్ వేస్ కడగండ్లు సరైన నిదర్శనం. కొన్నాళ్లుగా పైలట్లకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఎదుర్కొంటోంది జెట్ ఎయిర్ వేస్. రుణభారం తీవ్రతరం కావడమే కాకుండా, నడుపుతున్న రూట్లలో ఆదాయం అంతంత మాత్రంగానే ఉండడం జెట్ ఎయిర్ వేస్ కష్టాలను రెట్టింపు చేస్తోంది. ఇప్పటికే ఆ సంస్థకు చెందిన 90 శాతం విమానాలు విమానాశ్రయాలకే పరిమితం అయ్యాయి. అరకొర నిధులతో కొన్ని విమానాలు నడుపుతున్నా అవెప్పుడు నిలిచిపోతాయో తెలియని పరిస్థితుల్లో ప్రయాణికులు కూడా జెట్ ఎయిర్ వేస్ పై పెద్దగా ఆసక్తి చూపని పరిస్థితి కనిపిస్తోంది.

తాజాగా, జెట్ ఎయిర్ వేస్ కు చెందిన ఓ విమానాన్ని నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డామ్ లో ఓ కార్గో సంస్థ స్వాధీనం చేసుకుంది. ఆ విమానం ముంబయి నుంచి మంగళవారం ఆమ్ స్టర్ డామ్ చేరుకుంది. ఆ సర్వీసు తిరిగి గురువారం ముంబయి రావాల్సి ఉంది. కానీ, తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాల్సిందేనంటూ ఆమ్ స్టర్ డామ్ విమానాశ్రయంలో కార్గో సేవలు అందించే ఓ సంస్థ గట్టిగా పట్టుబడుతూ, సదరు విమానాన్ని సీజ్ చేసింది. దీనిపై జెట్ ఎయిర్ వేస్ వర్గాలు స్పందించాయి. ఆమ్ స్టర్ డామ్-ముంబయి సర్వీసును కార్యకలాపాలకు సంబంధించిన  కారణాలతో రద్దు చేస్తునట్టు ఓ ప్రకటనలో తెలిపారు.

More Telugu News