Andhra Pradesh: జమ్మలమడుగులో హై సెక్యూరిటీ.. 2,000 మంది పోలీసులను మోహరించిన ఎన్నికల అధికారులు!

  • రేపు ఎన్నికల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు
  • కేంద్ర బలగాలతో కవాతు నిర్వహణ
  • గ్రామాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు

సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేస్తున్నారు. రేపటి పోలింగ్ కల్లా అన్నీ సిద్ధంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీస్ అధికారులను మోహరిస్తున్నారు. తాజాగా కడప జిల్లాలోని జమ్మలమడుగులో అధికారులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఫ్యాక్షన్ నేపథ్యమున్న ప్రాంతం కావడంతో పాటు గత అనుభవాల దృష్ట్యా ఏకంగా 2,000 మంది పోలీసులను అధికారులు మోహరించారు.

భద్రతలో భాగంగా జమ్మలమడుగుకు చేరుకున్న కేంద్ర బలగాలు.. కవాతును నిర్వహించాయి. అంతేకాకుండా నియోజకవర్గం పరిధిలోని ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల పరిధిలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రజలంతా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జమ్మలమడుగు డీఎస్పీ కృష్ణన్‌ సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More Telugu News