Telangana: ఉపాధి హామీ పనుల్లో విషాదం.. తెలంగాణలో 10 మంది కూలీలు సజీవసమాధి!

  • తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఘటన
  • మట్టిపెళ్లలు పడటంతో ఇద్దరికి తీవ్రగాయాలు
  • క్షతగాత్రుల పరిస్థితి విషమంగానే ఉందంటున్న వైద్యులు

తెలంగాణలోని నారాయణ పేట జిల్లాలో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలపై మట్టిపెళ్లలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో క్షతగాత్రులను తోటి కూలీలు ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

జిల్లాలోని మరికల్ మండలంలో ఉపాధి హామీ పనుల్లో భాగంగా కూలీలు ఓ మట్టి దిబ్బను తవ్వడం మొదలుపెట్టారు. అలా తవ్వుకుంటూ లోపలకు వెళ్లారు. అయితే  అక్కడి నేల వదులుగా ఉండటంతో ఒక్కసారిగా ఆ మట్టిపెళ్లలు వారిపై పడిపోయాయి.

దీంతో 10 మంది వాటి కింద చిక్కుకుని ఊపిరాడక ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. కాగా, ఈ ఘటనలో గాయపడ్డ ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News