Andhra Pradesh: ఈ రోజు రాత్రి, రేపు ఎన్నికల కోడ్ కచ్చితంగా అమలు చేస్తాం: సీఈఓ ద్వివేది

  • నియోజకవర్గాల్లోకి బయట వ్యక్తులను అనుమతించం
  • ఇప్పటి వరకూ రూ.196.03 కోట్లు సీజ్ చేశాం
  • ఈసారి పోలింగ్ శాతం 80 దాటొచ్చు

ఈ రోజు రాత్రి, రేపు ఎన్నికల కోడ్ కచ్చితంగా అమలు చేస్తామని ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ద్వివేది స్పష్టం చేశారు. ఏపీలో ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గాల్లోకి బయట వ్యక్తులను అనుమతించమని చెప్పారు. గత ఎన్నికల్లో 78 శాతం పోలింగ్ నమోదైందని, ఈసారి పోలింగ్ శాతం 80 దాటుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. సీ-విజిల్ యాప్ లో 5,607 ఫిర్యాదులు నమోదయ్యాయని, పెండింగ్ లో 26 ఫిర్యాదులు ఉన్నట్టు స్పష్టం చేశారు. సీ-విజిల్ లో ఎక్కువగా తప్పుడు కేసులు నమోదవుతున్నాయని అన్నారు.

పార్టీల ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు ఉదయం 6 గంటలకే రావాలని ఆదేశించారు. పోలింగ్ సన్నాహకాలు గంట ముందే ప్రారంభం అవుతాయని, ప్రతి పోలింగ్ బూత్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో రూ.196.03 కోట్లు సీజ్ చేసినట్టు తెలిపారు. ఏపీ ఎన్ ఫోర్స్ మెంట్ తమ విధులు బాగా నిర్వహిస్తోందని ద్వివేది ప్రశంసించారు.

More Telugu News