West Godavari District: అవినీతిపై పోరాడాలంటే ‘జనసేన’ను గెలిపించాలి: పవన్ కల్యాణ్

  • మేము అధికారంలోకొస్తే..
  • కేంద్రంతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు జీతాలు 
  • ప్రభుత్వ ఉద్యోగులకు పాత పద్ధతిలోనే పెన్షన్ ఇస్తాం

రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకు వచ్చిన జనసేన పార్టీని అందరూ ఆదరించాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కోరారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, అవినీతిపై పోరాడాలంటే జనసేన పార్టీని గెలిపించాలని కోరారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచనున్నట్టు హామీ ఇచ్చారు. దీని కోసం న్యూ పే కమిషన్ ను ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి, పాత పద్ధతిలోనే పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రతి టౌన్ లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ హౌసింగ్ బోర్డులు ఏర్పాటు చేసి ఇళ్లు కట్టిస్తామని, ఎడ్యుకేషన్ రిఫామ్స్ కమిషన్ ఏర్పాటు చేసి టీచరు, విద్యార్థుల కోసమే పని చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. టీచర్స్ కేవలం విద్యార్థుల కోసమే పనిచేయాలి తప్ప ఏ పార్టీల నాయకుల కోసం పనిచేయకూడదని కఠిన నిబంధనలు అమలు చేస్తామని, పాలకొల్లు వాసుల నీటి కష్టాలు తీరుస్తామని చెప్పారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పై పవన్ విమర్శలు గుప్పించారు. తిరుమలకు చెప్పులు వేసుకుని వెళ్లిన వ్యక్తి జగన్ అని, దేవుడిపై గౌరవం లేని వ్యక్తికి ప్రజలపై ఉంటుందా? అని ప్రశ్నించారు.  కాగా, ఈ ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ తో కలిసి ప్రముఖ హీరో అల్లు అర్జున్ పాల్గొన్నాడు.

More Telugu News