Ram Madhav: జగన్ మా వెంట ఉండివుంటే... కేసులు, ఆస్తుల జప్తులు ఉండేవా?: రామ్ మాధవ్

  • టీడీపీతో పొత్తు పెట్టుకుని నష్టపోయాం
  • సీబీఐ, ఈడీలను ప్రభావితం చేయడం లేదు
  • తప్పు చేయబట్టే చంద్రబాబుకు భయమన్న రామ్ మాధవ్

వైఎస్ జగన్ తో కుమ్మక్కై, ఏపీ రాజకీయాల్లో బీజేపీ వేలు పెడుతూ, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటోందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేస్తున్న విమర్శలపై బీజేపీ నేత రామ్ మాధవ్ మండిపడ్డారు. జగన్ ను తామేమీ ప్రాక్సీగా వినియోగించుకోవడం లేదని, ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో స్పష్టం చేసిన ఆయన, అదే జరిగివుంటే జగన్ పై విచారణ, ఆయన సంస్థల, బంధువుల ఆస్తుల అటాచ్ మెంట్ ఉండేదా? అని ప్రశ్నించారు.

తమకెవరూ బీ-టీమ్ లేరని, గతంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని నష్టపోయామని ఆయన అన్నారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు తాము బలైపోయామని, ఇకపై అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా సొంతంగా ఎదిగేందుకు కృషి చేస్తామని అన్నారు.

జగన్ పై కేసులున్నాయని, కేసులున్నాయనే ఆయన బీజేపీని ఏమీ అనడం లేదని, ఏ కేసులూ లేని ఆయన (చంద్రబాబు) రేపు తననేదో చేసేస్తామని రోడ్డు మీద ధర్నాలకు దిగుతున్నాడని ఎద్దేవా చేశారు. ఇన్వెస్టిగేటింగ్ ఏజన్సీల స్వతంత్రతను తాము ఎన్నడూ అడ్డుకోవడం లేదని, వారు చేసే పని వారు చేసుకుంటూ పోతున్నారని, తాము కల్పించుకోవడం లేదని వెల్లడించారు.

 సీబీఐ, ఈడీలను బీజేపీ వాడుకుంటోందన్నది తప్పుడు ఆరోపణలని, అలాగే వాడుకుని వుంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది జైల్లో ఉండేవారని అన్నారు. గతంలో తప్పులు చేసి ఉండబట్టే చంద్రబాబు ఇప్పుడు భయపడుతున్నారని విమర్శలు గుప్పించారు. తప్పు చేయకుంటే విచారణంటే భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. 

More Telugu News