Chandrababu: ఏపీలో అధికారం టీడీపీదే.. ఆంధ్రజ్యోతి సర్వే ఫలితాలు!

  • తమకోసం వై.శ్రీనివాస్ బృందం సర్వే చేసిందన్న ఆంధ్రజ్యోతి
  • 105 అసెంబ్లీ స్థానాలతో టీడీపీదే విజయం
  • 65 స్థానాలకే పరిమితం కానున్న వైసీపీ
  • టీడీపీకి 18, వైసీపీకి 7 లోక్‌సభ స్థానాలు

మరికొన్ని గంటల్లో ప్రచారం పరిసమాప్తం కానున్న వేళ ఏపీలో ఎవరు గెలుస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఉత్కంఠ కలిగిస్తున్న ఏపీలో ఎవరు గెలుస్తారన్న దానిపై పలు సర్వేలు ఇప్పటికే తమ అభిప్రాయాల్ని వెల్లడించగా, ‘అబ్బే.. ఆ సర్వే మాది కాదు’ అంటూ మరికొన్ని సంస్థలు వివరణ ఇచ్చుకున్నాయి. తాజాగా రిపబ్లిక్ టీవీ-సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో ఏపీలో టీడీపీ 14 లోక్‌సభ స్థానాలను, వైసీపీ 11 స్థానాలను గెలుచుకుంటుందని తేల్చింది.

ఇక, ఆంధ్రజ్యోతి దినపత్రిక నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టబోయేది తెలుగుదేశం పార్టీయేనని, ప్రజలు మరోమారు ఆ పార్టీకి పట్టం కట్టబోతున్నారని తేల్చి చెప్పింది. శాస్త్రీయ సర్వేలకు, కచ్చితమైన ఫలితాలకు పేరొందిన వై.శ్రీనివాస్ బృందం తమకోసం చేసిన సర్వే వివరాలంటూ ఆంధ్రజ్యోతి ఈ వివరాలను వెల్లడించింది. ఆ సర్వే ప్రకారం..

రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు గాను 105 స్థానాల్లో టీడీపీ విజయం సాధించి పూర్తి మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుంది. ఇక, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 65 స్థానాలకే పరిమితం కానుందని అంచనా వేసింది. అయితే, ప్రకటించిన ఈ అంచనాల్లో పది స్థానాల వరకు అటూ ఇటూ ఉండొచ్చని వివరించింది. ఇతరులు 2 నుంచి 5 స్థానాల్లో విజయం సాధిస్తారని తెలిపింది. ఇక, లోక్‌సభ విషయానికి వస్తే టీడీపీ 18, వైసీపీ 7 స్థానాలను సొంతం చేసుకుంటాయని తెలిపింది. వీటిలో కూడా రెండు స్థానాలు అటూ ఇటుగా ఉంటాయని పేర్కొంది. అంటే, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌కు ఘోర పరాభవం తప్పదని అంచనా వేసింది.

మార్చి 15 నుంచి ఈ నెల మూడో తేదీ వరకు నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 43 నియోజకవర్గాల్లోని ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించినట్టు ఆంధ్రజ్యోతి వివరించింది. వీటిలో 35 నియోజకవర్గాల్లో ర్యాండమ్‌గా, ఎనిమిదింటిని శాస్త్రీయ నిబంధనల ప్రకారం ఎంపిక చేసుకున్నట్టు తెలిపింది. ప్రతీ నియోజకవర్గంలో 12 వేల మంది చొప్పున మొత్తంగా 50 వేల మంది నుంచి అభిప్రాయాలను సేకరించినట్టు పేర్కొంది. వీరిలో  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు, రైతు కూలీలు, కార్మికులు.. ఇలా సర్వే ప్రమాణాల ప్రకారం అందరినీ తగిన నిష్పత్తిలో ప్రశ్నించి వివరాలు రాబట్టినట్టు ఆంధ్రజ్యోతి తెలిపింది.

More Telugu News