YS Viveka: రక్తపు మరకలు తుడిపించింది గంగిరెడ్డే.. వైఎస్ వివేకా హత్య కేసులో పిఏ కృష్ణారెడ్డి వాంగ్మూలం!

  • గుండెపోటని తొలుత చెప్పింది ఎర్ర గంగిరెడ్డే
  • ఆయన చెప్పబట్టే రక్తపు మరకలు తుడిచారన్న పోలీసులు
  • నిందితులకు 22 వరకూ రిమాండ్ విధించిన కోర్టు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, జగన్ బాబాయ్ వైఎస్‌ వివేకానందరెడ్డి, గుండెపోటుతో చనిపోయి ఉండవచ్చని తొలిసారిగా చెప్పింది ఎర్ర గంగిరెడ్డేనని, ఆయన ఆదేశాల మేరకే లక్ష్మి, రాజశేఖర్‌ లు పడకగదిలో రక్తపు మరకలు తుడిచారని వివేకా పిఏ కృష్ణారెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్టు పోలీసులు కోర్టుకు సమర్పించారు.

గంగిరెడ్డి, ఇనాయతుల్లా, ట్యాంకర్‌ బాషా, రాజశేఖర్‌ లు వివేకానందరెడ్డి మృతదేహాన్ని బాత్ రూమ్ నుంచి బెడ్ రూమ్ లోకి తెచ్చారని తమకు కృష్ణారెడ్డి వెల్లడించినట్టు పోలీసులు పేర్కొన్నారు. మార్చి 15న వివేకా, కడప జిల్లాలోని పులివెందులలో తన నివాసంలోనే దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే.

హత్యకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేశారనే అభియోగంపై ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్‌ లను పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల పాటు వారిని విచారించిన పోలీసులు, కోర్టు విధించిన కస్టడీ గడువు ముగియడంతో నిన్న నిందితులను కోర్టులో హాజరు పరిచారు. ఆపై కోర్టు వారికి 22 వరకూ జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. 

More Telugu News