Ram Gopal Varma: బర్త్ డే అంటే చిరాకు.. చావుకు దగ్గరవుతున్నామనిపిస్తుంటుంది: వర్మ

  • ఏదైనా సాధిస్తే సెలబ్రేట్ చేసుకుంటే అర్థం ఉంటుంది
  • ఈ రోజు నటుడిగా నేను పుట్టాను
  • కీరవాణితో 29 ఏళ్ల తరువాత మళ్లీ పని చేస్తున్నా

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నటుడిగా మారబోతున్నాడు. మొట్టమొదటి సారిగా ‘కోబ్రా’ అనే సినిమాలో వర్మ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నారు. ఆర్జీవీ గన్ షాట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డీపీఆర్ నిర్మిస్తున్న ఈ సినిమాను వర్మ, అగస్త్య మంజులు కలిసి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నేడు వర్మ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ, ‘‘బర్త్‌డే అంటే నాకు చాలా చిరాకు. ఒక సంవత్సరం చావుకు దగ్గరవుతున్నామనిపిస్తుంటుంది. మనం పుట్టిన తర్వాత ఏదో ఒకటి సాధిస్తే, అది సెలబ్రేట్ చేసుకుంటే ఎక్కువ అర్థం ఉంటుందనేది నా అభిప్రాయం. ఇంత చెబుతున్న నేను, ఈ సంవత్సరం పుట్టినరోజు ఎందుకు చేసుకుంటున్నానంటే ఈ రోజు నటుడిగా పుట్టాను.

కోబ్రా మూవీ స్క్రిప్ట్ రాస్తుంటే, కొత్త రకమైన ఇంటెలిజన్స్ ఆఫీసర్ పాత్రలో నేనే నటిస్తే బాగుంటుందనిపించింది. మరో ప్రత్యేకత ఏంటంటే, ఈ సినిమాతో ‘ఆర్జీవి గన్ షాట్ ప్రొడక్షన్స్’ నిర్మాణంలోకి అడుగుపెడుతోంది. ఇక ఈ సినిమాకు ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, నా కెరీర్‌లో ‘క్షణక్షణం’ సినిమా మ్యూజిక్ పరంగా ఓ మైలురాయి. 29 ఏళ్ల తర్వాత మళ్లీ నేనూ, కీరవాణి గారు ‘కోబ్రా’ సినిమా కోసం కలిసి పని చేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు.

More Telugu News