hotel: హోటల్ గదిలో రహస్య కెమెరా పెట్టిన యాజమాన్యం.. తెలివిగా పట్టుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్!

  • న్యూజిలాండ్ లోని ఓ హోటల్ లో ఘటన
  • ఎయిర్‌బీఎన్‌బీ అనే యాప్ ద్వారా బుకింగ్
  • హోటల్ పై కొరడా ఝుళిపించిన ఎయిర్‌బీఎన్‌బీ

ప్రజల వ్యక్తిగత గోప్యతకు తూట్లు పొడిచేలా పలువురు వ్యవహరిస్తున్నారు. రహస్యంగా వారి వ్యక్తిగత చర్యలను రికార్డు చేస్తున్నారు. తాజాగా న్యూజిలాండ్ లో ఓ జంటకు ఇలాంటి అనుభవమే ఎదురయింది. హోటల్ లో దిగిన ఓ జంట చర్యలను రికార్డు చేసేందుకు హోటల్ యజమాన్యం వారి గదిలో రహస్య వీడియో కెమెరాను అమర్చింది. అయితే భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావడంతో ఈ రహస్య కెమెరాను గుర్తించారు. దీంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

న్యూజిలాండ్ కు చెందిన బార్కర్ అనే వ్యక్తి ఎయిర్‌బీఎన్‌బీ అనే యాప్ ద్వారా ఓ హోటల్ రూమ్ ను బుక్ చేశారు. తన భార్య, ఐదుగురు పిల్లలతో వీరు హోటల్ లో దిగారు. ఈ నేపథ్యంలో ఫోన్ కు వైఫై కనెక్ట్ చేద్దామని బార్కర్ ప్రయత్నించాడు. వెంటనే ‘ఐపీ కెమెరా’ అనే ఆప్షన్ కనిపించింది. దీంతో ఆ గదిలో రహస్య కెమెరా ఉందని బార్కర్ కు అర్థమైంది. స్వతహాగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన బార్కర్ డివైజ్ పోర్ట్ ను స్కాన్ చేసి కంగుతిన్నాడు. ఎందుకంటే అందులో తన గదిలోని వీడియో లైవ్ గా ప్రత్యక్షమవుతోంది.

తన గది సీలింగ్ లో రహస్య కెమెరా పెట్టినట్లు బార్కర్ గుర్తించాడు. వెంటనే హోటల్ యాజమాన్యాన్ని నిలదీశాడు. దీంతో తాము కెమెరా పెట్టిన విషయం వాస్తవమేనని హోటల్ యాజమాన్యం ఒప్పుకుంది. దీంతో బార్కర్ తన కుటుంబంతో కలిసి మరో హోటల్ కు మారిపోయాడు. ఈ విషయమై బార్కర్ ఎయిర్‌బీఎన్‌బీ కంపెనీకి ఫిర్యాదు చేశాడు. అయితే బార్కర్ కుటుంబానికి క్షమాపణలు చెప్పిన ఎయిర్‌బీఎన్‌బీ హోటల్ పై చర్యలు తీసుకోకుండా ఉండిపోయింది. దీంతో చివరికి బార్కర్ ఈ వ్యవహారాన్ని ఫేస్ బుక్, తన బ్లాగ్ లో పోస్ట్ చేయడంతో విషయం వైరల్ గా మారింది.

ఈ నేపథ్యంలో దిగివచ్చిన ఎయిర్‌బీఎన్‌బీ కంపెనీ.. ఈ ఘటనపై చింతిస్తున్నట్లు తెలిపింది. బార్కర్ కుటుంబానికి నగదును రీఫండ్ చేస్తున్నట్లు చెప్పింది. ఏదైనా హోటల్ కెమెరాలను అమర్చితే ముందుగా కస్టమర్ల అంగీకారం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. సంబంధిత హోటల్ ను తమ వెబ్ సైట్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

More Telugu News