India: 'పాకిస్థాన్ పై మరో దాడి' వార్తలపై స్పందించిన ఇండియా!

  • పాకిస్థాన్ వార్ హిస్టీరియాతో బాధించబడుతోంది
  • పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే ఎన్నికలను టార్గెట్ చేసుకుంటున్నారు
  • ఖురేషీ వ్యాఖ్యలను ఖండించిన భారత్

ఇండియా తమ దేశంపై ఏప్రిల్ 16 నుంచి 20 మధ్య మరోసారి దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని, ఎన్నికల్లో లబ్ధిని పొందేందుకు బీజేపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ ఆరోపించడంపై ఇండియా మండిపడింది. ఖురేషీ వ్యాఖ్యలపై స్పందించిన భారత్, పాకిస్థాన్ వార్ హిస్టీరియాతో బాధించబడుతోందని, పాక్ వ్యాఖ్యలు గిమ్మిక్కని, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే భారత ఎన్నికలను లక్ష్యం చేసుకుని తెగబడతారని ఇంటెలిజెన్స్ హెచ్చరించిందని వ్యాఖ్యానించింది.

విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, సీమాంతర ఉగ్రవాదానికి అసలు సిసలైన ప్రతినిధి పాకిస్థానేనని, మరో దాడికి సిద్ధమవుతున్న ఉగ్రవాదుల నుంచి దేశం దృష్టిని మరల్చేందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. అంత భయమే ఉంటే ద్వైపాక్షిక మార్గాల ద్వారా తమకు ఈ సమాచారం ఎలా వచ్చిందో తెలియజేయాలని సవాల్ విసిరారు. కాగా, బాలాకోట్ పై భారత వాయు సేన దాడి తరువాత సుమారు నెల రోజులకు ఖురేషీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

More Telugu News