Haryana: మాంసం దుకాణాలు మూసివేయాలంటూ ‘హిందూసేన’ బెదిరింపులు.. కత్తులతో రోడ్లపై వీరంగం

  • గురుగ్రామ్‌లో హిందూ సేన హల్‌చల్ 
  • నవరాత్రి ఉత్సవాలు జరిగే 9 రోజులూ దుకాణాలు బంద్ చేయాలని బెదిరింపు
  • గతేడాది కర్రలతో.. ఇప్పుడు కత్తులతో..

హరియాణాలోని గురుగ్రామ్‌లోని దుండహెరా గావ్‌లో ‘హిందు సేన’ కార్యకర్తలు వీరంగమేశారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఏడాదికి రెండుసార్లు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. తాజాగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాగా, ఉత్సవాలు జరిగే తొమ్మిది రోజులూ మాంసం దుకాణాలు బంద్ చేయాలంటూ యజమానులను బెదిరించారు. కత్తులు పట్టుకుని ఊరంతా తిరుగుతూ హల్‌చల్ చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కొందరు హిందూసేన కార్యకర్తలు చేతిలో కత్తులు పట్టుకుని మాంసం దుకాణదారులను బెదిరిస్తున్నట్టు ఉంది. ఉత్సవాలు జరిగే 9 రోజులూ దుకాణాలను మూసివేయాలని హెచ్చరించడం ఆ వీడియోలో వినిపిస్తోంది. గురుగ్రామ్‌లో ఇటువంటివి కొత్తకాదు. గతేడాది కూడా ఇలాగే కొందరు కర్రలు పట్టుకుని దుకాణదారులను బెదిరించారు. హిందూసేన బెదిరింపులతో భయపడిన దుకాణదారులు పోలీసులను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాల్సిందిగా వేడుకున్నారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించారు.

More Telugu News