Chandrababu: వీవీప్యాట్ల లెక్కింపు వ్యవహారం.. సుప్రీంకోర్టులో చంద్రబాబు కౌంటర్ అఫిడవిట్

  • ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు వేళుతోందని ఆరోపణ 
  • 50 శాతం వీవీప్యాట్‌లను లెక్కించాలంటూ ఈసీకి ఫిర్యాదు
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన 21 పార్టీల ప్రతిపక్ష బృందం

ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపు సమయంలో 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలంటూ దాఖలైన కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఇది నేడు విచారణకు రానుంది. నిజానికి వీవీప్యాట్ల స్లిప్పులను కూడా లెక్కించాలంటే ఆరు రోజులకుపైగా పడుతుందంటూ ఈసీ చెప్పిన లెక్కల్లో ఏమాత్రం వాస్తవం లేదని పిటిషనర్లు వాదిస్తున్నారు. కనీసం 50 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాల్సిందేనని, ఈ మేరకు ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సిబ్బందిని పెంచడం ద్వారా గంటల్లోనే మొత్తం స్లిప్పులను లెక్కించవచ్చని పిటిషన్‌దారులు పేర్కొన్నారు.  

ఈవీఎంలలో ఏ బటన్ నొక్కినా ఓట్లు బీజేపీకే పడుతున్నాయని ఆరోపిస్తూ చంద్రబాబు నేతృత్వంలోని 21 పార్టీలకు చెందిన విపక్ష నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దేశవ్యాప్తంగా ఉండే ఈవీఎంలలో 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించడానికీ... ఫలితాలు వెల్లడించడానికీ దాదాపు ఆరు రోజులు పడుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ యేతర పార్టీల బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆరు రోజులు పట్టినా పర్వాలేదనీ, వీవీప్యాట్‌లలోని స్లిప్పులను లెక్కించాలని ఆదేశించాలని కోరింది. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ నేడు విచారణకు రానుంది.

More Telugu News