Facebook: పోస్టు పెట్టింది అతడా? కాదా? అని ఓ వ్యక్తి ఇంటికి వెళ్లి మరీ చెక్ చేసిన ఫేస్ బుక్ ప్రతినిధులు

  • ఆధార్ కార్డు, ఇతర పత్రాల పరిశీలన
  • ఆశ్చర్యపోయిన ఖాతాదారుడు
  • ఇదేం పద్ధతని ప్రశ్నించిన సుప్రీంకోర్టు న్యాయవాది

అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కేంబ్రిడ్జ్ అనలిటికా వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వ్యవహారంలో కోట్లాదిమంది ఫేస్ బుక్ ఖాతాదారుల డేటా లీకైనట్టు గుర్తించారు. దాంతో ఫేస్ బుక్ విశ్వసనీయతపై సందేహాలు వచ్చాయి. అప్పటినుంచి నిబంధనలను మరింత కట్టుదిట్టం చేస్తోంది ఫేస్ బుక్. ఇప్పుడు భారత్ లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పొలిటికల్ పోస్టులపై ఈ సోషల్ మీడియా దిగ్గజం ప్రత్యేక దృష్టి సారించింది.

ఈ క్రమంలో, ఫేస్ బుక్ ప్రతినిధులు ఢిల్లీలో ఓ వ్యక్తి ఇంటికి వెళ్లి మరీ తనిఖీలు నిర్వహించారు. ఫేస్ బుక్ లో కనిపించిన ఓ పోస్టు పెట్టింది అతడా? కాదా? అనే విషయాన్ని అతడి ఇంటికి వెళ్లి మరీ నిర్ధారించుకున్నారు. తనిఖీల్లో భాగంగా ఫేస్ బుక్ ప్రతినిధులు ఆ వ్యక్తిని ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు పత్రాలను చూపించమన్నారు. పోస్టు చేసిన వ్యక్తి తానేనా లేక మరెవరైనా చేశారా? అనేది తెలుసుకోవడానికి ఫేస్ బుక్ ప్రతినిధులు తన ఇంటికి వచ్చారని ఆ వ్యక్తి వెల్లడించారు.

అయితే ఇది ఖాతాదారుల ప్రైవసీకి భంగం అని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది పవన్ దుగ్గల్ అంటున్నారు. ఫేస్ బుక్ తన ప్రతినిధులను ఖాతాదారు ఇంటికి తనిఖీలకు పంపడం ఏంటని ప్రశ్నించారు. అవసరమైన పక్షంలో అతడి పోస్టు అభ్యంతరకరం అని భావిస్తే దాన్ని బ్లాక్ చేసే సౌకర్యం ఉన్నప్పుడు ఇంటికి వచ్చి తనిఖీలు చేయడం ఎందుకు? అని దుగ్గల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

More Telugu News